హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెప్పుచేతల్లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పనిచేస్తున్నారని రెడ్కో చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. బీజేపీయేతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే వారి లక్ష్యం.. దానిలో భాగంగా అక్కడి గవర్నర్లను కేంద్రం కీలుబొమ్మల్లా వాడుకుంటున్నదని ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీజేపీ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, గౌరవప్రదమైన రాజ్‌భవన్‌ను ఓ పార్టీ ఆఫీసులా మార్చేశారని పేర్కొన్నారు. ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ కంటే ముందు మాట్లాడిన ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు గవర్నర్ల తీరును తప్పుపట్టారని ఆయన తెలిపారు. గవర్నర్ తమిళిసై రాష్ర్టానికి సంబంధించిన 7 ముఖ్యమైన బిల్లులను ఎందుకు పకన పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.