బీసీ నేత, సీనియర్ మంత్రి కొండా సురేఖపై వేటు పడింది. ఆమెను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. అనేక ఒత్తిళ్ల మధ్య, సుదీర్ఘ మంతనాల తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం.. తొలగింపునకు సమ్మతి తెలిపింది. సీఎం ధోరణిని ఎందరో విమర్శించినా, సురేఖపైనే వేటు వేయడం బీసీ వర్గాల్లో ఆగ్రహానికి కారణమవుతున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖపై బర్తరఫ్ వేటు పడింది. ఆమెను క్యాబినెట్ నుంచి తొలగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి పంపిన సిఫారసుకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు సురేఖ తొలగింపును ఖరారు చేస్తూ లోక్ భవన్ అధికారిక గెజిట్ విడుదల చేసింది. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ఇతర బీసీ నేతలను వెంటేసుకొని స్వ యం గా లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యా రు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనల నేపథ్యంలో కొండా సురేఖ బర్తరఫ్‌ను తక్షణమే ఆమోదించాలని కోరారు. సీఎంతో భేటీ ముగిసిన కొద్దిసేపటికే సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నట్టు రాజ్‌భవన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే సచివాలయంలోని నాలుగో ఫ్లోర్లో ఉన్న సురేఖ కార్యాలయాన్ని జీఏడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రశ్నించే గొంతులను తొక్కిపెట్టే వ్యూహం!
పార్టీలోని సీనియర్లు, ప్రశ్నించే గొంతులను తొకిపెట్టే వ్యూహానికి రేవంత్‌రెడ్డి సరార్ పదునుపెట్టింది. కొంతకాలంగా సాగుతున్న తెరవెనుక నాటకీయ పరిణామాలకు తెరదించుతూ మంత్రి కొండా సురేఖపై సీఎం వేటు వేశారు. మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని పంపిన సీఎం దూతల రాయబారాలను సురేఖ నిర్ద్వంద్వంగా తిరసరించడంతో రేవంత్‌రెడ్డి ఏమాత్రం సంకోచించకుండా ఆమెను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ సిఫార్సు లేఖను లోక్‌భవన్‌కు పంపారు.
సీఎం ముఖ్య కార్యదర్శి వీ శేషాద్రి గురువారం సాయంత్రం ఈ లేఖను గవర్నర్ కార్యాలయంలో అధికారికంగా అందించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తనదారికి తెచ్చుకున్న రేవంత్, చివరికి పంతం నెగ్గించుకొని ప్రజల్లో ఉన్న బలమైన బీసీ మహిళా నేతను మంత్రివర్గం నుంచి బయటకు పంపారు. ఆమెతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డిని పదవి నుంచి తప్పిస్తూ సీఎంవో కార్యాలయం నోట్ విడుదల చేసింది. తద్వారా అసలు కాంగ్రెస్ మీద ఇకపై వలస కాంగ్రెస్‌కు తిరుగులేదనే సంకేతాలు పంపినట్టయింది.
సుస్మిత వ్యాఖ్యల సాకుతో
ఈ రాజకీయ రణరంగానికి ఆగస్టు 19న కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. సీఎం వ్యవహారశైలి, గాంధీభవన్‌లో కొందరికే దకుతున్న ప్రా ధాన్యం, ముఖ్యమంత్రి ఆధిపత్యాన్ని నేరుగా ఆమె నిలదీయడాన్ని సీఎం వర్గం ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. ఈ అంశాన్ని వెంట నే టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందుకు తెచ్చి కక్షసాధింపు చర్యలకు శరవేగంగా పావులు కదిపింది. ఆమె కూతురు చేసిన విమర్శల నెపాన్ని పూర్తిగా తల్లిపైకి నెట్టి, రాజకీయంగా అణచివేసే కుట్రను పకాగా అమలు చేశారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతున్నది.
ముగ్గురు బీసీ మహిళా నేతలకు పదవులు
క్యాబినెట్‌లోని ఏకైక బీసీ మహిళా మంత్రి పై వేటు వేయడం ద్వారా కాంగ్రెస్ బీసీ వ్యతిరేకత బట్టబయలైంది. బీసీవర్గాల్లో ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకు సీఎం హడావుడిగా ‘డ్యామేజ్ కంట్రోల్’ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. సురేఖ బర్తరఫ్ సిఫార్సు రాజ్‌భవన్‌కు చేరిన నిమిషాల వ్యవధిలోనే ఏకకాలంలో ముగ్గురు బీసీ మహిళా నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజ య్ జాజు ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేయించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి, తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కుడా చైర్‌పర్సన్‌గా సుధారాణిని నియమించారు.
సరికొత్త నాటకం
ప్రభుత్వంలో బీసీ మహిళలకు పెద్దపీట వేస్తున్నామని చెప్తూనే సరికొత్త నాటకానికి రేవంత్‌రెడ్డి తెరతీశారనే చర్చ జరుగుతున్నది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అనుచిత వ్యా ఖ్యలు చేశారనే క్రమశిక్షణా కమిటీ నివేదికను అడ్డంపెట్టుకొని సీనియర్ నేత జీ చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానం లో బీసీ వర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మికి క్యాబినెట్ హోదా పదవి కట్టబెట్టారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నేరెళ్ల శారదను తక్షణ మే నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి నేరళ్ల శారదకు ఇవ్వకుండా ఇదే ముఖ్యమంత్రి మొదట్లో అడ్డంపడ్డారనే ఆరోపణలున్నాయి. మహిళా కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే శారద పదవీ కాలం ముగిసింది. తిరిగి ఆమెకు పదవి ఇవ్వకుండా గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ పదవి ముగిసేంత వరకు వేచి ఉండి, ఆమెను మహిళా కమిషన్ చైర్మన్‌గా నియమించారు. సురేఖ సొంత గడ్డ వరంగల్‌లో కొండా ప్రభావాన్ని దెబ్బతీసేందుకు సుధారాణికి పదవి కట్టబెట్టారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది.
కొండాను ఏకాకిని చేసేలా
మంత్రివర్గం నుంచి సురేఖను తప్పించిన వెంటనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా వర్గాన్ని పూర్తిగా ఏకాకిని చేసేలా రేవంత్ వర్గం వ్యూహాత్మక పావులు కదిపినట్టు సమాచారం. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని ఆకస్మికంగా తప్పించి, ఆ స్థానంలో జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కూర్చోబెట్టడం ఇందులో భాగమేనని తెలుస్తున్నది. అదే సమయంలో సురేఖ రాజకీయ ఇలాకా అయిన వరంగల్‌లో కొండా ప్రభావంపై దెబ్బకొట్టేందుకు గుండు సుధారాణికి కుడా చైర్పర్సన్ పగ్గాలు, నేరెళ్ల శారదకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ బాధ్యతలు కట్టబెట్టారు. కొండాకు ప్రత్యామ్నాయంగా ఇతర నేతలకు కీలక పదవులు కట్టబెట్టి, తద్వారా వరంగల్ రాజకీయాన్ని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడమే రేవంత్ ఎత్తుగడగా అసలు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.