Congress Govt | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ భారాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసినట్టు తెలుస్తున్నది. దీనిపై ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో బీటెక్ కన్వీనర్ కోటా సీట్ల పెంపునకు సర్కారు అదిలోనే బ్రేకులు వేసినట్టు సమాచారం. బీటెక్‌లో ప్రస్తుతం 87,184 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. కొత్తగా రెండు ఇంజినీరింగ్ కాలేజీలు మంజూరయ్యాయి. శాతవాహన, పాలమూరు యూనివర్సిటీల్లో కొత్తగా ఇంజినీరింగ్ కాలేజీలను ప్రారంభించనున్నారు. వీటిల్లో మూడు, నాలుగు బ్రాంచీలనే ప్రారంభించనున్నారు. ఒక్కో బ్రాంచీలో 60 సీట్లు మాత్రమే ఉండటంతో సీట్ల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశాల్లేవు. ఇక కొత్తగూడెంలోని మైనింగ్ కాలేజీని ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేసినా దీంట్లో కొత్త కోర్సులేవి లేవు.
రీయింబర్స్మెంట్ బకాయిలు ఇప్పటికే సర్కారు పాలిట గుదిబండగా మారాయి. దాదాపు 8వేల కోట్ల బకాయిలున్నట్టు కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ రెండేండ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇక కొత్తగా సీట్ల పెంపునకు అనుమతిస్తే ఆయా సీట్లకు సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. 10వేల లోపు ర్యాంకు పొందిన అందరు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు ర్యాంక్‌తో సంబంధం లేకుండా కాలేజీల్లో ఫీజు ఎంతుంటే అంత మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. ఇక బీసీ విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి రూ. 35వేలు ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌గా ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో కొత్త సీట్లు ఇచ్చుకుంటూ పోతే ఫీజు రీయింబర్స్మెంట్ భారంగా మారుతుందన్న భయం సర్కారును పట్టిపీడిస్తున్నది. దీంతో సీట్ల పెంపునకు సర్కారు ఆసక్తి చూపడం లేదని సమాచారం.
2024 -25 విద్యాసంవత్సరంలో కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు కోర్సుల కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం అనుమతించలేదు. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కోర్టు మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించాలని తీర్పునిచ్చినా ప్రభుత్వం మొండికేసింది. ఫలితంగా 6 వేల సీట్లకు కోతపడింది. కోర్టు తీర్పు ఆసరాగా చేసుకున్న కొన్ని కాలేజీలు సొంతంగా సీట్లు నింపుకున్నాయి. ఈ 6వేల సీట్లల్లో కేవలం 400 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆ 6వేల సీట్లను ఈ సారైనా ఇవ్వాలంటూ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.