ఒకవైపు కొనుగోలు కేంద్రాలు లేవు. ఉన్నచోట కొనుగోళ్లు లేవు. సర్కారు నిర్లక్ష్యంతో రైతులు వడ్లరాశి ముందు పడిగాపులు పడుతున్నారు. ఈ సీజన్లో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తామన్న రేవంత్ సర్కారు ఇప్పటివరకు కొన్నది కేవలం 15 లక్షల టన్నులే!
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కొండంత లక్ష్యం పెట్టుకున్న ప్రభుత్వం కొన్నది మాత్రం పిసరంతే. తేమ, తాలు, రంగుమారిందంటూ కొర్రీలు పెడుతుండటంతో అన్నదాతలు రోజుల తరబడి కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 15 లక్షల టన్నులు మాత్రమే. వానకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రణాళిక ప్రకారం అక్టోబర్‌లో 6.89 లక్షల టన్నులు, నవంబర్‌లో 32.95 లక్షల టన్నులు, డిసెంబర్లో 27.03 లక్షల టన్నులు, జనవరిలో 8.12 లక్షల టన్నులు కొనుగోలు చేయాలి. దీని ప్రకారం నవంబర్ నెలాఖరు వరకు 39.84 లక్షల టన్నుల కొనుగోలు చేయాలి. కానీ, 15 లక్షల టన్నులతో సరిపెట్టింది. ఇందులో దొడ్డు ధాన్యం 8 లక్షల టన్నులు కాగా సన్నధాన్యం 7 లక్షల టన్నులు ఉంది.
ఆర్థిక భారం.. సర్కారు పలాయనం
ఈ వానకాలం సీజన్లో 65.96 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 159 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని సర్కారు అంచనా వేసింది. ఇందులో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం సుమారు రూ. 20 వేల కోట్ల నిధులు అవసరం. సర్కారు వైఖరిని చూస్తుంటే కొనుగోళ్ల లక్ష్యం నెరవేరేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, సన్నధాన్యానికి బోనస్ భారం నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోళ్లలో అలసత్వం ప్రదర్శిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికీ తెరుచుకోని కేంద్రాలు
ధాన్యం కొనుగోలు ప్రారంభించి దాదాపు రెండు నెలలు కావొస్తున్నది. కానీ ఇప్పటికి మొత్తం కేంద్రాలు ప్రారంభించకపోవడం గమనార్హం. ఈ సీజన్లో మొత్తం 8,332 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు సివిల్ సప్లయ్ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 7,300 కేంద్రాలను మాత్రమే ప్రారంభించింది. అంటే ఇంకా వెయ్యికి పైగా కేంద్రాలు ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం.
చెల్లింపుల్లోనూ ఆలస్యమే
రైతులు తమ ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామంటూ ఇటు సివిల్ సప్లయ్ అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలు గొప్పగా ప్రకటించారు. కానీ వారి ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రైతులు తమ ధాన్యం విక్రయించి వారాలు గడుస్తున్నా డబ్బులు అందడంలేదు. ప్రస్తుతం రైతులకు రూ. 2 వేల కోట్లకు పైగా చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 15 లక్షల టన్నులకు గానూ బోనస్‌తో కలిపి రైతులకు రూ. 4 వేల కోట్ల వరకు చెల్లించాలి. కానీ రైతులకు రూ. 2,036వేల కోట్లు మాత్రమే చెల్లించినట్టు తెలిసింది. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడాల్సి వస్తుందని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొనుగోళ్లలో వేగం పెంచాలని, మిగిలిన కేంద్రాలను కూడా తెరవాలని, పెండింగ్ డబ్బు లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.