హైదరాబాద్ మే 30 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మహిళాశక్తి చీరెల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. నూలు సిద్ధమైనా కూలి రేటు ఖరారు కాకపోవడంతో ఉత్పత్తి ఆలస్యమవుతున్నదని తెలుస్తున్నది. బతుకమ్మ చీరెల మాదిరిగానే మీటరుకు రూ.34 చొప్పున చెల్లిస్తామని సర్కారు మెలిక పెడుతుండడంతో కార్మికులు తయారీకి ముందుకురావడంలేదు. వెరసీ మహిళా సంఘాల్లోని సభ్యులకు ఆగస్టు 15 నాటికి చీరల పంపిణీ సాధ్యం కాకపోవచ్చని అధికారవర్గాలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నాయి.
ప్రకటన ఆర్భాటం.. పనులు ఆలస్యం
రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 65 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రెండు చొప్పున చీరలు పంపిణీ చేస్తామని, 2024 ఆగస్టు 8న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. బతుకమ్మ పండుగ నాటికి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. బతుకమ్మ పండుగకు పంపిణీ చేయకపోగా, సంక్రాంతికి ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం వరుసగా వాయిదాలు వేస్తూ పోతున్నా.. చేనేత జౌళిశాఖ అధికారులు చర్యలు చేపట్టలేదు. 2025 జనవరిలో ఒక విడత, మార్చిలో రెండో విడత చీరల కోసం వస్త్రం ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చారు. అయితే సిరిసిల్లలో 26 వేల మరమగ్గాలు ఉండగా కేవలం 2 వేల సాంచాలపైనే వస్ర్తోత్పత్తి చేయాలని నిర్ణయించారు.
కూలి రేటుపై మీనమేషాలు
రెండు విడుతల్లో కలిపి చేనేత జౌళిశాఖ 4.24 కోట్ల మహిళా శక్తి చీరలకు ఆర్డర్లు ఇచ్చింది. ఆసాములు, కార్మికులకు ఇచ్చే కూలీరేటు నిర్ణయించలేదు. గతంలో బతుకమ్మ చీరలకు మీటరకు రూ.34 చొప్పున చెల్లించేవారు. ఇందులో ఆసాములకు రూ. 11, కార్మికులకు రూ. 5 చొప్పున చెల్లించేవారు. ప్రస్తుతం ప్రభుత్వం చెప్తున్నట్టుగా కాటన్ చీర ఉత్పత్తి చేయాలంటే పనిభారం ఎక్కువగా ఉంటుందని, కూలీ పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం మీటరకు రూ.2 చొప్పున అంటే ఆసాములకు రూ. 13, కార్మికులకు రూ. 7 చొప్పున ఇవ్వాలని కోరుతున్నారు. లేకపోతే నెలకు రూ.10 వేలు కూడా వచ్చే పరిస్థితిలేదని వాపోతున్నారు. కార్మికుల విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వస్త్ర ఉత్పత్తి మొదలుకాలేదు.
బతుకమ్మ పండుగకైనా అందేనా?
ముఖ్యమంత్రి ప్రకటించి 9 నెలలవుతున్నా చీరల తయారీ ప్రారంభంకాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 1.50 కోట్ల బతుకమ్మ చీరల ఉత్పత్తికి తొమ్మిది, పది నెలల ముందే ఆర్డర్లు ఇచ్చేది. ఉరుకులు పరుగుల మీద నేస్తేనే బతుకమ్మ పండుగనాటికి చీరలు సిద్ధమయ్యేవి. కానీ ఈ ఏడాది ఆగస్టు 15న నాటికి చీరలు అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ ఇందుకు ఇంకా రెండున్నర నెలల సమయం మాత్రమే ఉన్నది. ఈ పరిస్థితుల్లో చీరలు అందే పరిస్థితి ఉండదని, కనీసం బతుకమ్మ పండుగకు కూడా మహిళా శక్తి చీరలు పంపిణీ చేసే పరిస్థితి కనిపించడంలేదని అధికారులు చెప్తున్నారు.