Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నూతన డీజీపీ నియామకానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కొత్త డీజీపీ పోస్టు కోసం ఐదుగురి పేర్లతో ప్రతిపాదనను సోమవారం కేంద్రానికి పంపనున్నది. ఈ మేరకు ప్రభుత్వం సీనియార్టీ జాబితాను రూపొందించినట్టు తెలిసింది. కేంద్రప్రభుత్వం ఈ నెల తొలి వారంలోనే నూతన డీజీపీ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఐదుగురి పేర్లతో ప్రతిపాదనలు పంపించాలని, ఆ జాబితాలో నుంచి ముగ్గురి పేర్లను సూచిస్తామని పేర్కొన్న విషయం విదితమే. దీంతో కేంద్రంలోని డీవోపీటీ ఆదేశాల మేరకు ఐదుగురి పేర్లతో ప్రతిపాదిత జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. కాగా, నిబంధనల మేరకు డీజీపీ ర్యాంకు ఉండి, రెండేండ్ల పదవీకాలం ఉన్నవారికి డీజీపీ పోస్టు కోసం ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీనియార్టీలో తొలి వరుసలో ఉన్న సీవీ ఆనంద్, రవిగుప్తా, సౌమ్యామిశ్రా, శివధర్‌రెడ్డి, శిఖాగోయల్ పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం జాబితా రూపొందించినట్టు తెలిసింది.
కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్ కూడా సీనియర్లుగా ఉన్నప్పటికీ వీరు మరో ఆరు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో వారి పేర్లను పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. అయితే, రవిగుప్తా కూడా ఈ ఏడాది ఆఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. అయినప్పటికీ ఆయన పేరును జాబితాలో చేర్చినట్టు తెలుస్తున్నది. ఈసారి ఆనంద్, శివధర్‌రెడ్డి, సౌమ్యామిశ్రాల్లో ఒకరికి డీజీపీ పదవి దక్కడం ఖాయమని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అన్ని సమీకరణాలు కుదిరితే రాష్ట్రంలో తొలి మహిళా డీజీపీగా సౌమ్యామిశ్రాకు అవకాశం లభించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నాయి. అయితే, రాజకీయ, సంస్థాగత సమీకరణాల ప్రకారం చూస్తే సీవీ ఆనంద్, శివధర్రెడ్డిల్లో ఒకరికి డీజీపీ పదవి లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. సోమవారం జాబితాను ఫైనల్ చేసి కేంద్రానికి పంపిస్తే నెలాఖరు లేదా వచ్చే నెల తొలివారంలోనే కొత్త డీజీపీ కొలువుదీరే అవకాశం ఉన్నది.
నెలాఖరులో సీఎస్, పీసీసీఎఫ్‌లు కూడా…
ఈ నెలాఖరుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పదవీ విరమణ చేయనున్నారు. అదే సమయంలో అటవీ శాఖ పీసీసీఎఫ్ డోబ్రియల్ కూడా పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మే ఒకటో తేదీ నాటికి సీఎస్, పీసీసీఎఫ్‌లుగా కొత్తవారు నియామకయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నూతన డీజీపీ నియామకం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంటే మే నెలలో రాష్ట్రంలోని మూడు కీలకమైన పోస్టుల్లో ముగ్గురు అధికారులు కొత్తవారే కొలువుదీరనున్నారు.