Telangana | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): పన్నులతో ప్రజలను వీరబాదుడు బాది భారీ మొత్తంలో ఆదాయాన్ని సమీకరించుకొనేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నది. అందులో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని నిబంధనలను మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నది. స్థిరాస్తి క్రయవిక్రయాలు, గిఫ్ట్‌డీడ్‌లు, డెవలప్మెంట్ అగ్రిమెంట్లతోపాటు ఫ్రాంచైజీ ఒప్పందాలు, రియల్ ఎస్టేట్ ఒప్పందాలు, పుస్తకాల కాపీరైట్స్, ప్రకటనలపై కూడా స్టాంప్ డ్యూటీ వసూలు చేయాలని, తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.18,228.82 కోట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి, పెద్దమొత్తంలో ఆస్తి పన్ను రాబట్టుకొనేందుకు చర్యలు చేపట్టడంతోపాటు ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇది కార్యరూపం దాల్చితే ప్రయాణికులకు పెను భారం తప్పదు. ఈ నేపథ్యంలో బస్సు చార్జీల పెంపు నిర్ణయాన్ని పునరాలోచించాలని ఇప్పటికే పలు వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
రూ.4 వేల కోట్ల అదనపు భారం
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.12,372.73 కోట్లు, 2022-23లో రూ.14,228.18 కోట్లు, 2023-24లో రూ.14,295.56 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని మరో రూ.4 వేల కోట్లకుపైగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర బడ్జెట్లో రేవంత్‌రెడ్డి సర్కారు ప్రకటించింది. దీనిలో భాగంగా భూముల మారెట్ విలువ, వాస్తవిక ధరలను పరిగణనలోకి తీసుకొని భూముల విలువలను నిర్ణయించడంతోపాటు రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్లు, ఫీజుల చెల్లింపులు, తదితర సుమారు 80 సేవలను ఆన్లైన్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర రాబడిని పెంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. దీంతో భవిష్యత్తులో స్థిరాస్తుల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు చేసుకునే వారిపై మరింత భారం పడటం ఖాయమని రియల్ ఎస్టేట్ నిఫుణులు చెప్తున్నారు.
ఇంటింటి సర్వేతో ఆస్తిపన్ను పెంపు
పెద్ద మొత్తంలో ఆస్తిపన్నును రాబట్టుకునేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వేను ప్రారంభించింది. ఈ సర్వేలో ప్రజల ఆస్తుల విలువను అంచనా వేసి, తదనుగుణంగా పన్నులు పెంచుతారు. ఆస్తిపన్ను ఎగ్గొడుతున్న వారిపై జీహెచ్ఎంసీ ఇప్పటికే దృష్టి పెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 19 లక్షల నిర్మాణాలు ఆస్తి పన్ను పరిధిలో ఉన్నాయి. వాటి ద్వారా రూ.1,900 కోట్ల ఆదాయం వస్తున్నది. చాలా భవనాలను నివాసేతర అవసరాలకు వినియోగిస్తున్నప్పటికీ వాటి యజమానులు నివాస క్యాటగిరీ కింద పన్నులు చెల్లిస్తున్నారు. ఐదంతస్తుల భవనంలో రెండు, మూడు అంతస్తులకే పన్నులు కడుతున్నారు. బడా నిర్మాణాలు ఎగ్గొడుతున్న పన్ను విలువ 90% మేరకు ఉంటుందని అంచనా. ఇలాంటి అవకతవకలను సరిదిద్ది, పన్ను రాబడిని పెంచేందుకు జీహెచ్ఎంసీ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) సర్వేను మొదలుపెట్టింది. మూడు దశల్లో ఈ సర్వే చేసి ఆస్తిపన్ను మదింపు చేయాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం నిర్ణయించింది. దీంతో పన్ను పరిధిలోకి వచ్చే నిర్మాణాల సంఖ్య 25 లక్షలు దాటుతుందని అధికారులు భావిస్తున్నారు.