Brown Vs White Eggs | నాణ్యమైన ప్రోటీన్ ను కలిగి ఉండే ఆహారాల్లో గుడ్లు కూడా ఒకటి. వీటిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటిలో ముఖ్యమైన ఆమైనో ఆమ్లాలతో పాటు విటమిన్ బి12, కోలిన్, లుటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వైద్యులు కూడా రోజుకు ఒక గుడ్డును ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అలాగే మార్కెట్ లో ప్రస్తుత కాలంలో వివిధ రకాల గుడ్లు లభిస్తున్నాయి. గోధుమ, తెలుపు రంగు గుడ్లు, ప్రోటీన్ ప్యాక్డ్ గుడ్లు, డబుల్ పచ్చసొన, ఫామ్ ప్రెష్ గుడ్లు వంటి రకరకాల గుడ్లు లభిస్తున్నాయి. ఇలా అనేక రకాలుగా లభించడంతో వీటిని ఎంపిక చేసుకోవడంలో గందరగోళం నెలకొంటుందని చెప్పవచ్చు. అదే విధంగా కొందరు గోధుమరంగు గుడ్లు మంచివి అని భావిస్తే కొందరు తెలుపు రంగు గుడ్లు మంచివి అని భావిస్తారు.. అసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గుడ్లల్లో సరైన వాటిని ఎలా ఎంచుకోవాలో.. వైద్యుల మాటల్లో తెలుసుకుందాం.
గోధుమ రంగు, తెలుపు రంగు గుడ్లు వేర్వేరు జాతుల కోళ్ల నుండి వస్తాయి. గోధుమ రంగు ఈకలు ఉన్న కోడి నుండి గోధుమరంగు గుడ్లు, తెలుపు రంగు ఈకలు ఉన్న కోడి నుండి తెలుపు రంగు గుడ్లు వస్తాయి. వీటిలో ప్రధాన వ్యత్యాసం గుడ్డు షెల్ రంగు మాత్రమే. గుడ్డు లోపల ఉండే సొనలో ఎటువంటి మార్పులు ఉండవు. వీటిని పోషకాల పరంగా పోల్చినప్పుడు ఇవి రెండు కూడా దాదాపు అన్ని రకాల పోషకాలను ఒకేలా కలిగి ఉన్నాయని పరిశోధనల ద్వారా నిపుణులు వెల్లడించారు. అలాగే ఈ రెండు రకాల గుడ్లను శరీరం ఒకేలా జీర్ణం చేస్తుందని పోషకాలపరంగా రెండూ కూడా ఒకేలా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
గోధుమరంగు గుడ్లు సహజంగా మందంగా కనిపిస్తాయి. కనుక ఇవి శరీరానికి ఎక్కువ మేలు చేస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ ఇది నిజం కాదని గుడ్డు లోపల పోషకాల పరిమాణాన్ని, నాణ్యతను పెంకు రంగు ప్రభావం చూపదని కూడా వారు తెలియజేస్తున్నారు. అలాగే మార్కెట్ లో గోధుమ రంగు గుడ్లు ఎక్కువ ధరకు లభిస్తాయి. అయితే దీని అర్థం గుడ్డు పోషకాలను ఎక్కువ కలిగి ఉంటుందని కాదు. ఈ గుడ్లు పెట్టే కోళ్లను పెంచడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. కనుక గోధుమ రంగు గుడ్లు ఎక్కువ ధర కలిగి ఉంటాయి. గోధుమ రంగు గుడ్లు, తెలుపు రంగు గుడ్లు రెండు కూడా ఆహారపరంగా సమానమేనని ఇవి రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. వ్యక్తిగత ప్రాధాన్యత, ధర విషయంపై గుడ్ల ఎంపిక ఆధారపడి ఉంటుందని పోషకాల పరంగా రెండు రకాల గుడ్లు సమానమేనని వైద్యులు తెలియజేస్తున్నారు.