వరంగల్: రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు నష్టపోకుండా ప్రతిగింజను కొనుగోలు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, అయితే కేంద్ర ప్రభుత్వం దొడ్డు రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుందని విమర్శించారు. అయినప్పటకీ రైతుకు నష్టం కలగకుండా మద్దతు ధర కల్పంచి ధాన్యం కోనుగోలు చేస్తుందని వెల్లడించారు.
బీజేపి రైతులను ఆగం చేసి రాజకీయ లబ్ధిపొందాలని కుట్రలు చేస్తుందన్నారు. ఢిల్లీ బీజేపీ దొడ్డు బియ్యం తీసుకోమంటుంటే.. గల్లీ బీజేపి వరి సాగు చేయాలని రెచ్చగొడుతుందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రైతులు ఆగం కావద్దని, ప్రత్యామ్నాయ, లాభసాటి పంటలను సాగుచేయాలని సూచిస్తున్నారని అన్నారు. రైతాంగం వచ్చే యాసంగిలో వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలైన పల్లి, పామాయిల్, ఇతర లాభదాయక పంటలు సాగు చేసేవిధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను కోరారు.
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని, అయినప్పటికీ రైతు శ్రేయస్సును కోరే సీఎం కేసీఆర్ దానిని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. బిజేపి మాయలో పడి ఆగం కావద్దని రైతులకు మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.