పెద్దపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం రామగుండం పట్టణంలోని 5 వ డివిజన్లో రూ. 10 లక్షల సింగరేణి సీఎస్ఆర్ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. పట్టణంలో రోడ్లు, మురిక కాల్వల నిర్మాణం, విద్యుత్, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్పొరేషన్ అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి, సీఎస్ఆర్, 14వ ఆర్థిక సంఘటం, ఎస్సీ సబ్ ప్లాన్, ఇతర నిధులతో సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని వెల్లడించారు.
రామగుండంను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలుపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక రావు, కార్పొరేటర్ కల్వచర్ల కృష్ణవేణి భూమయ్య, నాయకులు ఈదునూరి శ్రీకాంత్, కోడేపాక రాహుల్ తదితరులు ఉన్నారు.