హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు కక్ష కారణంగా ఈ ఏడాదీ ఎస్సారెస్పీ ఆయకట్టు పడావు పడింది. ఉమ్మడి రాష్ట్రంలోని దుస్థితి మళ్లీ దాపురించింది. ఎస్సారెస్పీ స్టేజ్-1 ఆయకట్టుకు సాగునీరు దిక్కులేకుండా పోయింది. స్టేజీ-1లోనే మొత్తంగా 9.65 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉండగా, కేవలం 2.34 లక్షల ఎకరాలకే సాగునీరిస్తామని చెప్పి సర్కారు చేతులెత్తేసింది. ఈ మేరకు తాజాగా తైబందీని ఖరారు చేసింది. మొత్తంగా గోదావరి బేసిన్లో మేజర్, మీడియం ప్రాజెక్టుల కింద ముందుగా 6 లక్షల ఎకరాలకు నీరివ్వాలని గత నెలలో నిర్ణయించగా, తాజాగా కేవలం 4.34 లక్షల ఎకరాలకు కుదించింది. గురువారం నుంచి నీటిని విడుదల చేయాలని ఆదేశాలను జారీ చేసింది. 2025-26 సంవత్సరం వానకాలం సాగుకు గాను భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద తైబందీ ఖరారుకు రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ ఈ సీజన్లో రెండోసారి బుధవారం సమావేశమైంది. ప్రత్యేకించి గోదావరి బేసిన్ ప్రాజెక్టుల కింద సాగునీటికి సంబంధించి యాక్షన్ప్లాన్పై ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్, సీఈ రఘునాథరావు నేతృత్వంలో చర్చించింది. ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలపై సమాలోచనలు చేసింది. తుదకు ప్రస్తుతం నీటి లభ్యత ఆధారంగా ఖరీఫ్‌లో గోదావరి బేసిన్లో మొత్తంగా 4,71,737 ఎకరాలకే నీళ్లివ్వాలని కమిటీ నిర్ణయించింది. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల్లో 50.34 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉండగా, 3,93,430 ఎకరాల్లో వరి పంటకు, 78,307 ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. మొత్తంగా మేజర్ ప్రాజెక్టుల కింద 3,29,847 ఎకరాలకు, మీడియం ప్రాజెక్టుల కింద 1,41,890 ఎకరాలకు నీళ్లివ్వనున్నారు.
ఈ ఏడాది ఎస్సారెస్పీ స్టేజ్-1 ఆయకట్టుకే సాగునీరు దిక్కులేకుండా పోయింది. స్టేజ్-1లో అంటే ఎల్ఎండీకి ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ 0 కి.మీ నుంచి 284వ కి.మీ వరకు 9,65,013 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఎస్సారెస్పీ స్టేజ్-2 అంటే కాకతీయ కెనాల్ 284వ కి.మీ నుంచి 347వ కి.మీ వరకు 3.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. మొత్తంగా స్టేజ్-1, స్టేజ్-2 కలుపుకొని 13.33 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ ఆయకట్టు మొత్తాన్ని 3 జోన్లుగా విభజించి ప్రతి సీజన్లో సాగునీటిని విడుదల చేయడం పరిపాటి. ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ వరకు జోన్ 1గా, ఎల్ఎండీ నుంచి 284వ కి.మీ వరకు జోన్ 2, అక్కడి నుంచి 347వ కి.మీ వరకు జోన్ 3గా పిలుస్తారు. ప్రస్తుతం జోన్ 1 అంటే ఎల్ఎండీ ఎగువన ఉన్న ఆయకట్టుకే పూర్తిస్థాయిలో నీరివ్వలేని దుస్థితి నెలకొన్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్-1 కింద కేవలం 2,34,639 ఎకరాలకు నీటిని విడుదల చేయాలని కమిటీ తాజాగా నిర్ణయించింది. లోయర్ మానేరుకు ఎగువన సరస్వతి, కాకతీయ కాలువల ద్వారా ఆయకట్టుకు మాత్రమే నీటిని అందించనున్నారు. అందుకు 25.30 టీఎంసీల జలాలు అవసరమవుతాయని తేల్చారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టునే కాకుండా గోదావరి బేసిన్‌లోని ఇతర మేజర్, మీడియం ప్రాజెక్టుల కింద కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. కడెం ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించినట్టుగా తెలుస్తున్నది. తైబందీని ఎక్కడా ఖరారు చేయలేదు. అలీసాగర్ లిఫ్ట్ కింద 49,803 ఎకరాలకు, గుత్ప లిఫ్ట్ కింద 35,405 ఎకరాలు, శ్రీపాద ఎల్లంపల్లి మంథని లిఫ్ట్ కింద 10 వేల ఎకరాలకు, ఘనపూర్ ఆనకట్ట 21,625, సదర్మాట్ 13,120, నీల్వాయి 12,790, గడ్డెన్నవాగు 9,000, లక్నవరం 8,794, చౌటపల్లి లిఫ్ట్ 8,297, గొల్లవాగు 8,000, పాలెంవాగు 7,500 ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. నేటి నుంచి ఆయా ప్రాజెక్టుల కింద కాలువలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు కమిటీ ఈ సందర్భంగా వెల్లడించింది. ఎస్సారెస్పీకి నేటి నుంచి విడుదల చేయనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కక్షగట్టడం గోదావరి బేసిన్లో ప్రధానంగా ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు శాపంగా మారుతున్నది. స్కైవమ్ కమిటీ గత నెల 11న మొదటి సారి సమావేశమైంది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఆ బేసిన్లో మొత్తం 18 లక్షల పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలని ఎస్సీఐఈఏఎం నిర్ణయించింది. ఈసారి గోదావరిబేసిన్లో దయనీయ పరిస్థితి నెలకొన్నది. ఇప్పటివరకు ప్రధాన గోదావరిలో ప్రధాన ప్రాజెక్టులకు మాత్రం ఆశించిన మేర జలాలు చేరలేదు. గోదావరి బేసిన్‌లోని ఆయకట్టుకు సాగునీరందడం ఈ ఏడాది కష్టమేనని ఆనాడే అభిప్రాయం వ్యక్తం చేసింది. అప్పటికీ అనామతు అంచనాలతో గోదావరి బేసిన్లో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకే నీరివ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయాలని అధికారులు ఎన్నివిధాలుగా చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ససేమిరా అంటున్నది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సమావేశమై ఆ ఆయకట్టును కూడా కుదించింది. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా సాగునీరందించామని ప్రగల్బాలు పలుకుతూ గత యాసంగిలోనూ ఎస్సారెస్పీ స్టేజ్-2 ఆయకట్టుకు నీరందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
ఆ మేరకు తైబందీని ఖరారు చేయడమేగాకుండా పత్రికా ప్రకటనలను కూడా జారీ చేసింది. తుదకు నీరివ్వలేక చేతులేత్తిసింది. తాజాగా స్టేజ్-1లోని జోన్1 ఆయకట్టుకే పూర్తిస్థాయిలో నీరివ్వలేమని సర్కారు చేతులెత్తేయడం గమనార్హం. ఉమ్మడి పాలనలో ఏనాడూ స్జేజ్-1లో మొత్తం ఆయకట్టులో రెండొంతుల ఆయకట్టుకు నీరందించిన దాఖలాల్లేవు. ఇక స్టేజ్-2 సంగతికి వస్తే తెలంగాణ ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే నాటికీ సాగునీరు అదని పరిస్థితి ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత 2022లో వానకాలం, యాసంగి కలిపి ఏకంగా 24,30,753 లక్షల ఎకరాలు సాగవడం ఎస్సారెస్పీ చరిత్రలోనే రికార్డు. అదెలా సాధ్యమైందంటే కాళేశ్వరం ప్రాజెక్టు చలవే. 2019లో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. కాకతీయ కాలువనే కాదు డిస్ట్రిబ్యూటరీల కింద ఉన్న చెరువులను కూడా గత సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనుసంధానించి ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా నీటితో నింపింది. దీంతో అసలు కరువన్నదే లేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కారు విస్మరించడమే గాక మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్ల పగుళ్లను సాకుగా చూపి నీటిని ఎత్తిపోయకపోవడం ఫలితంగా రైతులు మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తున్నది.
దేవాదుల ఎత్తిపోతల పథకంలో పైపులైన్ లీకేజీ ఏర్పడి గోదావరి జలాలు
వృథాగా పోతున్నాయి. ఈ ఘటన బుధవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో చోటుచేసుకున్నది. మండలంలోని జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి ధర్మసాగర్‌కు మోటర్లతో గోదావరి జలాలు పంపింగ్ చేస్తున్నారు. పెద్దకోడెపాక శివారులో దేవాదుల పైపులైన్‌కు లీకేజీ ఏర్పడి భారీగా నీళ్లు పైకి ఎగజిమ్మాయి. ఈక్రమంలో పైన 11కేవీ విద్యుత్తు తీగలు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరోచోట గోవిందాపూర్ శివారులో పైపులైన్ లీకేజీ ఏర్పడిందని రైతులు తెలిపారు. భారీగా గోదావరి జలాలు వృథాగా పోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. లీకేజీపై దేవాదుల అధికారులకు సమాచారం ఇవ్వడంతో మోటర్లను బంద్ చేశారు.