హైదరాబాద్, జూలై 5(నమస్తే తెలంగాణ): భూముల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పుడు వసూలు చేస్తున్న దానిపై 50శాతం వరకు పెంచే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిసింది. భూములు రిజిస్ట్రేషన్ ధరలను సవరిస్తున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూ ముల ధరలను సవరించాలని, అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారుల ను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ధరలకు, మార్కెట్ ధరలకు ఏయే ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉన్న చోట ఎంత శాతం ధరలు పెంచేందుకు అవకాశం ఉన్నదనే అంశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు.
సచివాలయంలో శనివారం భూ ముల ధరల సవరణతోపాటు కొత్త స్టాంప్ విధానంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యాపా ర ఒప్పందాలపై పారదర్శకత ఉండేలా నూతన స్టాంప్ విధానాన్ని భారతీయ స్టాంపు చట్టం- 1899ను అనుసరించి తెలంగాణ సవరణ బిల్లు-2025ను తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామ ని వెల్లడించారు. ఇక మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్న ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్ర స్తుతం కొత్త, పాత అపార్ట్మెంట్లకు స్టాంప్ డ్యూటీ ఒకేవిధంగా ఉందని పాత అపార్ట్మెంట్లకు రిజిస్ట్రేషన్ తేదీలను పరిగణనలోకి తీసుకొని స్టాంప్ డ్యూటీ తగ్గించాలనే భావిస్తున్నట్టు తెలిపారు.
వీఆర్వో, వీఆర్ఏలకు మరో అవకాశం
జీపీవోలుగా నియామకం కోసం వీఆర్వో, వీఆర్ఏలకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. శనివారం రెవెన్యూ సం ఘాలతో సమావేశమైన ఆయన.. జీపీవోల నియామకం కోసం నిర్వహించిన రాత పరీక్షలో 3,454 మంది వీఆర్వో, వీఆర్ఏలు జీపీవోలుగా అర్హత సాధించారని తెలిపారు.