హుస్నాబాద్ రూరల్, నవంబర్ 4 : తాము హామీ ఇచ్చిన పథకాలను వంద శాతం అమలు చేస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక పైలట్ గ్రామాలను ఎంపిక చేసింది. హడావుడిగా కొందరిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి మంజూరు పత్రాలు ఇచ్చింది. ఇదంతా నమ్మి అప్పులు చేసి ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టిన తర్వాత కాంగ్రెస్ సర్కారు మొండిచెయ్యి చూపింది.
తొలి లబ్ధిదారుకే మోసం
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ మండలం తోటపల్లిని నిరుడు పైలట్ గ్రామంగా ఎంపిక చేశారు. గ్రామానికి చెందిన అన్నారం లక్ష్మీని తొలి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలిగా గుర్తించారు. హుస్నాబాద్ మండలంలోనే మొట్టమొదటగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి స్థానిక కాంగ్రెస్ నాయకులతో పాటు అధికారులు లక్ష్మీ ఇంటికి భూమి పూజ చేశారు. బేస్మెంట్ లెవల్ పూర్తికాగానే మొదటి విడత బిల్లు పడింది. బిల్లులు రావడం లేదని చెప్పగా విడతల వారీగా వస్తాయంటూ నమ్మబలికారు. ఇప్పుడు తీరా నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు కడుతున్నారని చేతులెత్తేశారు.
పంచాయతీలో నివాసం.. గెంటేసిన పోలీసులు
తోటపల్లికి చెందిన చాతవేని ఎలేంద్ర, గంటె కోమల, అన్నారం లక్ష్మీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కొనసాగిస్తున్నా బిల్లులు మాత్రం రావడం లేదు. ఇల్లు లేకపోవడంతో ఎలేంద్ర కొడుకు మహేశ్ అ తడి భార్య గ్రామంలోని ఓ రేకుల షెడ్డులో తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గంటె కోమల, అన్నారం లక్ష్మి, మ రో లబ్ధిదారు గ్రామంలో కిరాయి ఇండ్ల్లల్లో ఉంటున్నారు. వర్షాల కారణంగా తాత్కాలిక రేకుల షెడ్డులో ఇబ్బందులు తలెత్తడంతో గ్రామ పంచాయతీలో ఉండేందుకు మంగళవారం సామగ్రితో చేరుకున్నారు. వెంటనే ఏఎస్సై మణెమ్మ ఇక్కడి నుంచి సామగ్రిని తీసేయాలని హెచ్చరించి, బలవంతంగా సామగ్రిని పంచాయతీ నుంచి బయట పెట్టించారు. చాతవేని మహేశ్‌పై కేసు నమోదు చేస్తున్నట్టు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.
మొదటి ఇల్లునే ఆపిండ్రు
తోటపల్లిలో తొలి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలిగా నన్ను గుర్తించిండ్రు. కొద్ది రోజులకే మొదటి బిల్లు పడింది. తరువాత నుంచి బిల్లులు రాలేదు. అధికారులను, నాయకులను కలిసి వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదు. అధికారులు బిల్లులు వస్తాయని చెప్పి పోయిండ్రు. బిల్లులు రాక నిర్మాణం నెమ్మదించింది.
-అన్నారం లక్ష్మి, తోటపల్లి (సిద్దిపేట జిల్లా)
పంచాయతీలో ఉంటే కేసు పెట్టిండ్రు
మా అమ్మ చాతవేని ఎలేంద్ర పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం చేపడతే మొదటి విడత బిల్లు జ మైంది. తరువాత నుంచి బిల్లులు రావడం లేదు. బంగారం కుదువ పెట్టి రూ.3 ల క్షలు, అందిన కాడికి అప్పులు తెచ్చి ఇంటి నిర్మాణం కొనసాగించినం. తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదంటూ నిర్మాణాన్ని నిలిపివేయాలని చెప్పడంతో ఆపేసినం. గత్యంతరం లేక గ్రామ పంచాయతీలో తలదాచుకునేందుకు వెళ్తే నా పై పంచాయతీ కార్యదర్శి ద్వారా పిటిషన్ తీసుకొని పోలీసులతో కేసు పెట్టించిండ్రు.
-చాతవేని మహేశ్, తోటపల్లి (సిద్దిపేట జిల్లా)