వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 25: రాష్ట్ర ఉద్యాన వర్సిటీకి ‘ప్రభుత్వ తెగులు’ పట్టింది. ఆ వర్సిటీలోని కూరగాయలు, ఔషధ మొక్కలు, పండ్లు, పూల సాగు విభాగాలను వ్యవసాయ వర్సిటీ నుంచి ఉద్యాన కళాశాల ఆవరణలోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అందుకు అవసరమైన స్థలాన్ని, కార్యాలయాల నిర్మాణానికి కావాల్సిన నిధులను కేటాయించకపోవడమే ఇందుకు కారణం. దీంతో ప్రస్తుతం ఆ విభాగాలు నామమాత్రపు సిబ్బందితో పేరుకే కొనసాగుతున్నాయి.
ఆ విభాగాల ఉన్నతాధికారులు విధులకు ఎగనామం పెట్టి, పైరవీల కోసం అధికార పార్టీ నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో విత్తనాలతోపాటు వ్యవసాయ సమాచారం కోసం వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తున్నది. దీనిపై కూరగాయల విభాగం హెడ్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనితా కుమారిని సంప్రదించడంతో..
తమ కార్యాలయ తరలింపునకు అవసరమైన స్థలాన్ని, నిధులను ప్రభుత్వం ఇంకా కేటాయించలేదని, ప్రస్తుతానికి తమ కార్యాలయాన్ని తాత్కాలికంగా నడిపేందుకు ఉద్యాన కళాశాలలోని ఓ గదిని మాత్రమే కేటాయించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈసారి కూరగాయల నర్సరీని కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు.