కరీంనగర్, నవంబర్ 13 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న విద్యాశాఖ మరో అశాస్త్రీయమైన నిర్ణయం తీసుకున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా భిన్నమైన విధానం తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలనూ లెక్కచేయకుండా సొంతంగా వింతైన పోకడలను అవలంబిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు ఉపాధ్యాయులనే నియమించేందుకు ప్రభుత్వం ఏకంగా ఉత్తర్వులనే జారీచేసింది. అమలుకు విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కమిటీలను నియమించారు. ఈ నిర్ణయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది.
ఈ విధానం వల్ల బోధన పక్కదారి పట్టడమే కాకుండా, ఉపాధ్యాయుల మధ్య విభేదాలు పొడచూపుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వాడుకోవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలున్నా, వాటిని లెక్క చేయకుండా పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే ఇక పర్యవేక్షణ పోస్టులకు మంగళం పాడినట్టేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడుతున్నారు.
రాష్ట్రంలోని పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను ఇప్పటివరకు డీఈవో, డిప్యూటీ డీఈవో, మండల విద్యాధికారులు చూసేవారు. ఉన్నత పాఠశాలల పరిధిలో డిప్యూటీ డీఈవో పర్యవేక్షించేవారు. పైస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తే జిల్లా విద్యాధికారికి నివేదిక సమర్పించే వారు. ఉన్నత పాఠశాలల్లో మెరుగైన బోధన పెంపునకు ప్యానల్ పర్యవేక్షణ ఉండేది. అంటే డిప్యూటీ డీఈవో ఆధ్వర్యంలో ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, ముందుస్తుగానే సంబంధిత పాఠశాలలకు సమాచారం ఇచ్చి వెళ్లేవారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 16,381 ప్రాథమిక, 3,094 ప్రాథమికోన్నత, 4,671 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 24,146 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల పర్యవేక్షణకు 33 జిల్లాల్లో కలిపి దాదాపు 1,850 నుంచి 1900 మంది ఉపాధ్యాయులను పర్యవేక్షులుగా నియమించనున్నారు. అందుకోసం ఆయా జిల్లాల్లో ఉన్న పాఠశాలలను బట్టి పర్యవేక్షక కమిటీలను నియమిస్తున్నారు. ఉదా: కరీంనగర్ కొత్త జిల్లాలో మొత్తం 383 ప్రాథమిక పాఠశాలలు ఉంటే, వీటి పర్యవేక్షణకు 12 మంది ఉపాధ్యాయులతో నాలుగు బృందాలను ఏర్పాటుచేశారు.
73 ప్రాథమికోన్నత పాఠశాల కోసం ముగ్గురు ఉపాధ్యాయులతో ఒక కమిటీ, 146 ఉన్నత పాఠశాలల కోసం 27 మంది ఉపాధ్యాయులతో 3 కమిటీలు ఏర్పాటుచేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. పాత విధానాలను పక్కన పెట్టేలా రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై ఉపాధ్యాయులే మండిపడుతున్నారు. పాఠశాలల తనిఖీలు, పర్యవేక్షణ పేరిట సహచర ఉపాధ్యాయులనే పర్యవేక్షించేందుకు కమిటీలు ఏర్పాటు చేయడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.
పాఠశాలల తనిఖీలపై పర్యవేక్షణ కమిటీలకు విద్యాశాఖ విధి విధానాలను జారీచేసింది. టాయిలెట్లు, తాగునీరు, ఏటీఎల్ ల్యాబ్, ఐసీటీ ల్యాబ్, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల హాజరు, పనివిధానం, విద్యార్థుల హాజరు, పేరెంట్-టీచర్ మీటింగ్, స్టేటస్ ఆఫ్ సివిల్ వర్క్స్, స్టూడెంట్ ఎన్రోల్మెంట్, యూనిఫాం, పాఠ్య, నోటు పుస్తకాలు, వైద్య చికిత్సలు, అకాడమిక్ ప్లానింగ్, బోధన, అభ్యసన, సామగ్రి, ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్ తదితర అంశాలను పర్యవేక్షించి, ఆ వివరాలను పైఅధికారులకు ప్రతినెలా నివేదికల రూపంలో ఇవ్వాలి.
ఆయా అంశాల్లో లోతైన పర్యవేక్షణకు కూడా గైడ్లెన్స్లో పొందుపర్చారు. ఉదా: మధ్యాహ్న భోజనంపై దాదాపు 14 అంశాలపై వివరాలు సేకరించి నమోదు చేయాలి. చెబుతున్నది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయని ఉపాధ్యాయులే చెప్తున్నారు. తనిఖీలు నిష్పపక్షపాతంగా ఉండాలి. తేడాలొస్తే ఉపాధ్యాయుల మధ్య విభేదాలు పొడచూపి, చివరకు చదువులు మొత్తం పక్కదారిపట్టే ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా తప్పన్న వాదనలు వస్తున్నాయి.