KCR | వనస్థలిపురం, ఫిబ్రవరి 18 : కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హస్తినాపురం డివిజన్ నందనవనం సర్కారు పాఠశాల ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు మూడు మొక్కలు నాటగా ఎందుకు అనుమతి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయురాలిపై ప్రభుత్వం వేటు వేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నందనవనంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక లక్కీ హోటల్ వద్ద కేక్ కట్ చేయడంతోపాటు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడు మొక్కలు నాటి, విద్యార్థులకు చాక్లెట్లు పంచారు. ఇదే నేరంగా భావించిన విద్యాశాఖ అధికారులు ఇన్చార్జి హెడ్ మాస్టర్‌గా ఉన్న రజితను మంగళవారం సస్పెండ్ చేశారు.
కేసీఆర్ జన్మదిన వేడుకలకు ఎలా అనుమతిచ్చారని, అది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ డీఈవో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇదే పాఠశాలలో ఎన్నోసార్లు జాతీయ, రాష్ట్ర నాయకుల జన్మదినం సందర్భంగా చాక్లెట్లు పంచిన సందర్భాలు ఉన్నాయి. సోమవారం హెడ్ మాస్టర్ సెలవులో ఉండటంతో ఆమె ఇన్చార్జి హెడ్ మాస్టర్‌గా ఉన్నారు.
కేసీఆర్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక, ఆయనపై ద్వేషంతో అధికార పార్టీ నాయకులు మొదట బీఆర్ఎస్ నాయకులపై కేసు పెట్టాలని సదరు టీచర్‌పై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. మొక్కలు నాటడంలో తప్పేముందని భావించిన టీచర్ అందుకు నిరాకరించడంతో ఆమెపైనే సస్పెన్షన్ వేటు వేయాలని ఓ ముఖ్యనేత ద్వారా పట్టుబట్టినట్టు సమాచారం. కాగా పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి కనుసన్నల్లోనే ఈ తతంగం నడిచిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. వెంటనే సస్పెన్షన్‌ను ఎత్తివేసి, టీచర్‌ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.