ఆలోచన ఉండాలే కానీ.. ఆచరణలో సాయం చేసేందుకు ‘మేమున్నామంటూ’ ముందుకొస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. వీ హబ్ ద్వారా ఎందరో మహిళామణులను ఆంత్రప్రెన్యూర్లను చేసిన కేసీఆర్ సర్కారు.. వంటింటికే పరిమితమైన ఎంతోమంది మహిళలను బిజినెస్ ఉమెన్లుగా మారుస్తున్నది.
స్వయం సహాయక సంఘాల ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తూనే.. వ్యాపారం చేసుకునేందుకు కావాల్సిన ఆర్థిక సాయమూ చేస్తున్నది. ప్రభుత్వ సాయం అందుకొని ఉపాధి బాటపట్టిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడల్పేట గ్రామానికి చెందిన కొమురవెల్లి రజిత తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు.
స్వయం సహాయక సంఘం రజిత తలరాతను మార్చేసింది. సంఘం ద్వారా రుణాలు పొందిన ఆమె సొంత గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి దూసుకెళ్తున్నారు. శ్రీ భవానీ మహిళా పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్న రజిత ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. స్త్రీనిధి ద్వారా రూ.లక్ష, మండల సమాఖ్య నుంచి రూ.40 వేల రుణం తీసుకుని నాలుగు యూనిట్లను ఏర్పాటు చేశారు. రాగి, గోధుమ, బియ్యం పిండి, పసుపుతో పాటు కారం పొడి తయారు చేసి విక్రయించి లాభాలు గడిస్తున్నారు.
భవానీ మహిళా పొదుపు సంఘం నుంచి రూ.80 వేల రుణం తీసుకొని కిరాణాషాపు పెట్టి వ్యాపారాన్ని మరింత విస్తరించారు. సొంత పొలంలో రాగులు పండిస్తున్న ఆమె పరకాల, వరంగల్ నుంచి గోధుమలు, బియ్యం, పసుపు కొమ్ములను తక్కువ ధరకే బల్క్‌గా కొనుగోలు చేస్తున్నారు. త్వరలో ఫ్లిప్కార్ట్లోనూ తన ఉత్పత్తులను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.15వేలకు పైగానే సంపాదిస్తున్నానని.. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటానని రజిత చెబుతున్నారు.