హైదరాబాద్ : తెలంగాణలో అత్యధికంగా జీవనాధారంగా కొనసాగుతున్న పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) తెలిపారు. మంగళవారం హోటల్ మ్యారియట్ లోని కన్వెన్షన్ సెంటర్ లో కేంద్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ స్టార్టప్ కాంక్లేవ్ లో పాల్గొని మాట్లాడారు. ముందుగా వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కేంద్ర మంత్రి పరషోత్తం రూపలాతో కలిసి ప్రారంభించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి తలసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పాడి రైతులకు అనేక విధాలుగా చేయూత ను అందించి అభివృద్ధి కి తోడ్పడిందని వివరించారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు నష్టాలలో ఉన్న విజయ డెయిరీ(Vijaya dairy) ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేడు రూ. 800 కోట్ల టర్నోవర్ కు చేరుకుందని చెప్పారు. సబ్సిడీపై దాణా సరఫరా, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.
ప్రజాదరణ కలిగిన విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో నూతన ఔట్ లెట్ లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటితో అనేకమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా స్వయం ఉపాధి(self employment) అవకాశాలు కూడా లభిస్తున్నాయని వివరించారు.రూ. 250 కోట్ల వ్యయంతో నూతనంగా మెగా డెయిరీ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీ చేయడంతో రాష్ట్రంలో గొర్రెల సంపద గణనీయంగా పెరిగిందన్నారు.
అందుబాటులో కి నూతన పరిజ్ఞానం వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్ తదితరులు ఉన్నారు.