హైదరాబాద్, ఆగస్టు15 (నమస్తే తెలంగాణ) : ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, నీట్ లాంటి జాతీయస్థాయి ఎంట్రెన్స్లలో వందలాది మంది గురుకుల విద్యార్థులకు ర్యాంకులు తెప్పించారు. జీవితంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వారిని ఉత్తములుగా తీర్చిదిద్దారు. మొత్తంగా గురుకులాలకే వన్నెతెచ్చారు. ఇంత చేసిన తమకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని మాత్రమే వారు అడిగారు. నెలలు గడుస్తుంటే పెన్‌డౌన్ చేసి నిరసన తెలిపారు.. అదే ఇప్పుడు వారి పాలిట శాపమైంది. ఫలితంగా రాష్ట్ర సర్కారు కాటుతో వారిపై వేటుపడింది. టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)లలో పనిచేసే హానరోరియం సిబ్బందిని ప్రభుత్వం తొలగించింది. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారడంతో ప్రభుత్వ దృష్టికి వెళ్లేలా చేయడంతో ప్రభుత్వం మాత్రం వారిపై కాఠిన్యం ప్రదర్శించింది. రాష్ట్రంలో 38 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఉన్నాయి. ఆ సీవోఈల్లో బాలికలకు 2,000, బాలురకు 1,680 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అన్ని సీవోఈల్లో కలిసి అందులో కెమెస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ విషయ నిపుణులు, సీనియర్ అధ్యాపకులు కలిపి మొత్తంగా 231 మంది సిబ్బంది ఉన్నారు. పనివిధానాన్ని బట్టి సిబ్బందికి హానరోరియం పేరిట వేతనాలను చెల్లిస్తున్నారు. ఆగస్టు15 దాటినా జూన్, జూలై నెలలకు సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుమార్లు సొసైటీ ఉన్నతాధికారులకు నివేదించారు. అయినా స్పందన కరువైంది. దీంతో ఇటీవలే పెన్‌డౌన్ ప్రకటించి నిరసన తెలిపారు. వేతనాలు అడిగిన సీవోఈ కేంద్రాల సిబ్బందిపై ప్రభుత్వం ఇప్పుడు కక్షసాధింపు చర్యలకు దిగింది. తాజాగా గౌలిదొడ్డి, కరీంనగర్, చిల్కూర్, మహేంద్రహిల్స్, నార్సింగి, షేక్‌పేట్ తదితర సీవోఈల్లో మొత్తంగా 57 మందిని తొలగించి రెగ్యులర్ సిబ్బంది నియామకానికి సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి ఉత్తర్వులు జారీ చేశారు. సీవోఈల్లో పనిచేయాలనే ఆసక్తి ఉన్న నాన్ సీవోఈల్లో పనిచేస్తున్న రెగ్యులర్ జేఎల్, పీజీటీలు దరఖాస్తు చేసుకోవాలని, వారికి డిప్యూటేషన్ కల్పిస్తామని సెక్రటరీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సీవోఈ కేంద్రాల సిబ్బంది తొలగింపు నిర్ణయం అక్కడి విద్యార్థులకు తీరని నష్టం కలుగనున్నది. లక్షలాది రూపాయల విలువచేసే కోచింగ్‌ను ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. కార్పొరేట్ స్థాయిలో ఇంటర్ విద్యను అందిస్తున్నారు. జాతీయ పోటీ పరీక్షల్లో ఏటేటా వందలాది ర్యాంకులు వచ్చేలా ఈకేంద్రాలు దోహదపడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆ విధానానికి స్వస్తిపలికి రెగ్యులర్ సిబ్బందితో చెప్పించడమంటే సీవోఈలనే నిర్వీర్యం చేసినట్టేనని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.