హైదరాబాద్ : గ్రూప్-1 పరీక్ష ఫలితాలను రద్దుచేసి, రీవాల్యుయేషన్ లేదా మళ్లీ పరీక్ష నిర్వహించడం ద్వారా ఎనిమిది నెలల్లో నియామక ప్రక్రియ పూర్తిచేయాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్‌రెడ్డి స్పందించారు. ఈ పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఫలితాలు రద్దయినందుకు సీఎం రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్‌కు వచ్చి క్షమాపణ చెప్పాలని అన్నారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘గ్రూప్ 1 పరీక్షలో అవకతకవలు జరిగాయని రాష్ట్ర హైకోర్టు గుర్తించినందుకు ధన్యవాదాలు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ర్యాంకులు రద్దు చేయడం, రీవాల్యుయేషన్ చేయడం మాత్రమే కాదు గ్రూప్ 1 పరీక్ష మీద సీబీఐతో ఎంక్వైరీకి ఆదేశించాలి. అవకతవకలకు కారణం ఎవరు..? వాళ్ల వెనకాల ఉన్నవాళ్లు ఎవరనే దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అప్పుడే అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది.
అలాగే రీవాల్యుయేషన్ చేయడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని అనుకోవడంలేదు. ఎందుకంటే గతంలో ఆ ప్రక్రియ నిర్వహించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు, ప్రభుత్వమే మళ్లీ ఆ పని చేస్తున్నది. కాబట్టి అది పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం లేదు. వాళ్లు మళ్లీ తప్పులు చేసే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రక్రియను యూపీఎస్సీకి అప్పగించాలి. లేదంటే హైకోర్టు వారే స్వయంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. లోపాలకు తావులేకుండా ఈ ప్రక్రియ పూర్తిచేయాలి’ అన్నారు.
‘అభ్యర్థులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే ఇప్పటికే నిర్వహించిన పరీక్షల నోటిఫికేషన్ దగ్గర నుంచి మార్కుల లెక్కింపుదాకా ప్రతి దాంట్లో తప్పిదాలు, లోపాలు ఉన్నాయి. రిజర్వేషన్ల విషయంలో తప్పులు జరిగాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో, మెయిన్స్ హాల్ టికెట్ నంబర్లు మారడం వంటి అనేక తప్పిదాలు జరిగాయి. ప్రతి స్టేజ్‌లో లోపాలతో తప్పుల తడకగా పరీక్ష నిర్వహించారు. అభ్యర్థుల్లో చాలామంది ఈ సమస్యలను ఎత్తిచూపినా సర్కారు పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళ్లి పరీక్ష నిర్వహించింది. వారి జీవితాలతో ఆడుకున్నది. ఆనాడు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పరీక్ష నిర్వహిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. కేవలం చైర్మన్‌ను మార్చి పరీక్షలు నిర్వహించాడు. అంటే అవకతవకవలను ఆయన కూడా ప్రోత్సహించినట్టే. ఇకమీదట జరిగే పరీక్షలు కూడా సరిగా జరుగుతాయన్న నమ్మకం లేదు. అంతేకాదు.. తాము గ్రూప్ 1 పరీక్షనిర్వహించామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి.. ఈ తప్పిదాలు చేసినందుకు అశోక్ నగర్‌కు వచ్చి, నిరుద్యోగులకు, గ్రూప్ వన్ అభ్యర్థులు అందరికి క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
‘కనీసం ఈ స్టేజ్‌లో అయినా సర్కారు తప్పిదాలు బయటపడ్డాయి. కాబట్టి దీనికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలి. అప్పుడు మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించాలి. లేకపోతే అభ్యర్థుల భవిష్యత్తు అంధకారం అవుతుంది. గతంలో గ్రూప్ 1 విషయంలో పేపర్ లీక్ అయ్యిందన్న విషయాన్ని ప్రభుత్వమే గుర్తించి చర్యలు తీసుకుంది. అయినా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నానాయాగి చేసింది. కానీ ఇప్పుడు అక్రమాలు జరిగాయని స్వయంగా హైకోర్టు గుర్తించింది. రీవాల్యుయేషన్ చేయాలని చెప్పింది. అంటే కచ్చితంగా ఇది ప్రభుత్వ తప్పిదమే. నాడు అభ్యర్థులను ఆందోళనకు గురిచేసేలా మాట్లాడిన వారు.. ఇప్పుడు అదే అభ్యర్థుల పక్షాన ఎందుకు నిలబడటం లేదు’ అని ప్రశ్నించారు.