పాలకుర్తి, మే 19: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూర్, తొర్రూర్ గ్రామాల్లో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యానికి ఇన్ని రోజులు కాంటా వేయకుండా ఉండలేదని గుర్తు చేశారు. మూడు నెలల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై మండిపడ్డారు. ధాన్యానికి బోనస్ ఇస్తామంటూ బోగస్ మాటలు చెప్పి రైతుల ఉసురు తీస్తున్నదని ఆరోపించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ పాలనలో ఐదు నెలల్లోనే అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సన్న, దొడ్డు వడ్లు అనే తేడా లేకుండా వెంటనే అన్నింటికీ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పస్నూరి నవీన్, ఎంపీటీసీ మాటూరి యాకయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఎండీ అఫ్రోజ్ పాల్గొన్నారు.