Indiramma Illu | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా.. ఇప్పటి ధరల ప్రకారం ఒక్కో లబ్ధిదారుడిపై రూ.2 లక్షలకుపైగా అదనపు భారం పడుతున్నది. ఉచిత ఇసుక వల్ల లబ్ధిదారులకు చేకూరే ప్రయోజనం అరకొరగానే ఉన్నది. ఇసక రీచ్ల వద్ద ఉచితంగా ఇసుక ఇచ్చినా.. దాని రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ప్రభుత్వం ఇస్తామంటున్న ఉచిత ఇసుక ఇంటి నిర్మాణ అసరాలకు సరిపోదని లబ్ధిదారులు వాపోతున్నారు. దీనికితోటు సిమెంటు, స్టీలు ధరలు మండిపోతున్నాయి. ప్రభుత్వం ఒక్కో ఇంటికి సుమారు 30 టన్నుల వరకు ఇసుకను ఉచితంగా సరఫరా చేసేందుకు ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. దీని ప్రకారం స్థానిక తహసీల్దార్ లబ్ధిదారులకు టోకెన్ జారీచేస్తే.. దాని ఆధారంగా రీచ్ల వద్ద ఉచితంగా ఇసుక ఇస్తారు.
టన్ను ఇసుకను రీచ్ల వద్ద టీజీఎండీసీ రూ.400 చొప్పున విక్రయిస్తుండగా, రవాణా చార్జీలు కలుపుకొని అది హైదరాబాద్లో రూ.2,000-2,200 వరకు విక్రయిస్తున్నారు. వివిధ జిల్లాల్లో టన్ను ఇసుక ధర రూ.1,500 నుంచి రూ.1,800 వరకు పలుకుతున్నది. ఈ లెక్కన ప్రభుత్వం చేకూర్చుతున్న లబ్ధి కేవలం రూ.12,000 కాగా, లబ్ధిదారుడు రూ.42వేల వరకు వెచ్చించాల్సి వస్తున్నది. ఒక్కో ఇంటికి కనీసం 40 టన్నుల నుంచి 50 టన్నుల ఇసుక అవసరం కాగా, ప్రభుత్వం 30 టన్నులకు మాత్రమే టోకెన్లు మంజూరుచేయాలని నిర్ణయించింది. దీంతో మిగిలిన 20 టన్నుల ఇసుకను పూర్తి ధర, అంటే టన్నుకు రూ.1,800 చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే, లబ్ధిదారుడు మరో రూ.36,000 వరకు చెల్లించి ఇసుకను కొనుగోలు చేయాలి. మొత్తం 50 టన్నుల ఇసుకకు టన్నుకు రూ.1,800 చొప్పున రూ.90 వేలు ఖర్చవుతుండగా, ప్రభుత్వం చేకూర్చుతున్న లబ్ధి రూ.12,000 మాత్రమే కావడం గమనార్హం. అంటే, ప్రభుత్వం ఉచితంగా ఇస్తామంటున్న ఇసుకకు తోడు ఒక్కో లబ్ధిదారుడు ఇసుక కోసం దాదాపు రూ.78 వేల వరకు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒక్కో ఇంటికి ప్రభుత్వం నాలుగు దశల్లో రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నది. ఇందులో ఇసుకకే రూ.78 వేలు పోగా, మిగిలేది రూ.4,22,000 మాత్రమే. టన్ను స్టీలు ధర రూ.58 వేల వరకు ఉండగా, సిమెంటు ఒక సంచి ధర రూ.300 వరకు ఉన్నది. ఇటుక, కంకర, ఫ్లోరింగ్ బండలు, తలుపులు, కిటికీలు, కరెంటు సామాన్లు, ప్లంబింగ్ సామాన్లు తదితర నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటన్నింటికీ రూ.ఆరు లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు ఖర్చవుతుందని నిర్మాణరంగ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఒక్కో చదరపు అడుగుకు మెటీరియల్తో కలుపుకొని రూ.1,500 నుంచి 1,700 వరకు ఖర్చవుతుందని బిల్డర్లు వివరిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ప్రతి చదరపు అడుగుకు రూ.1,200 చొప్పున ఖర్చయినా 600 చదరపు అడుగుల నిర్మాణానికి రూ.7,20,000 ఖర్చవుతుందని చెప్తున్నారు. ఇందులో ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చినా లబ్ధిదారు తన చేతినుంచి రూ.2.2 లక్షలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్టీలు, సిమెంటు కూడా ఉచితంగా అందించి అప్పులపాలు కాకుండా తమను ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.