Congress Govt |హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల నియంత్రణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా వారియర్లపై రౌడీషీట్ తెరవనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అన్ని పోలీస్స్టేషన్లకు డీజీపీ నుంచి ఉత్తర్వులు వెళ్లాయి. సోషల్ మీడియా ముసుగులో కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయకులను దోచుకుంటున్న సంఘటనలు కోకొల్లలుగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలు, అలవాటుగా నేరాలకు పాల్పడేవారిపై హిస్టరీషీట్/సస్పెక్ట్ షీట్ తెరవాలని డీజీపీ ఆదేశించారు. సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న వారిని అరికట్టేందుకు ఈ ఉత్తర్వులు వెలువడినట్టు పైకి కనిపిస్తున్నా.. నిజానికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే వారిని భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సోషల్ మీడియా ఓ వారధిగా నిలిచింది.
దీంతో ప్రభుత్వం సోషల్‌మీడియాపై ఉక్కుపాదం మోపేదుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నదని వారు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులపై కేసులు నమోదు చేయడం ఇటీవల రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ మేరకు పలు మార్గదర్శకాలు కూడా జారీచేసింది. హైకోర్టుతీర్పును ప్రజాస్వామిక రక్షణ కవచంగా భావించిన ప్రజానీకం, సోషల్‌మీడియా వారియర్లు, ప్రజాగొంతుకగా మారి… పోరాట పంథా అనుసరిస్తున్నారు. ప్రజల మనోభావాలను సోషల్ మీడియా ద్వారా ప్రతిబింబిస్తున్నారు. దీంతో దిక్కుతోచని కాంగ్రెస్ సర్కార్ మరింత కఠినమైన ఆంక్షల అమలు కోసం మరో కొత్త ఎత్తుగడ వేసినట్టుగా భావిస్తున్నారు. సైబర్ నేరాల నియంత్రణ కోసమంటూ మంగళవారం జారీ చేసిన మెమోలో సోషల్ మీడియా గురించి ప్రస్తావించిన తీరు, పేర్కొన్న విధివిధానాలు చూస్తుంటే ఇలాంటి అనుమానాలకు తావిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు, మీడియా నిపుణులు పేర్కొంటున్నారు.
అసలేంటీ హిస్టరీ షీట్స్/సస్పెక్ట్ షీట్స్?
సోషల్ మీడియా వేదికగా నేరాలకు పాల్పడేవారు, ఆర్థిక పరమైన మోసాలు చేసేవారు, పాత నేరస్థులు, అలవాటుగా తరచూ నేరాలకు పాల్పడేవారిపై భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. అటువంటి వారిపై సస్పెక్ట్/హిస్టరీ షీట్లు తెరవాలని స్పష్టంచేసింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ విభాగం మంగళవారం ఓ మెమో(నెం-405) జారీచేసింది. డీజీపీ ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలు, అలవాటుగా నేరాలకు పాల్పడేవారి కదలికలపై దృష్టి కేంద్రీకరించాలని మెమోలో స్పష్టంచేశారు. అటువంటివారిపై సస్పెక్ట్/హిస్టరీ షీట్లు తెరవాలని హైదరాబాద్‌లోని అన్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు మెమో జారీచేశారు. గతంలో మోపిన నేరారోపణల్లో దోషులుగా తేలకున్నా వారిని అనుమానితుల జాబితాలో చేర్చి వారిపై నిఘా ఉంచాలని, సస్పెక్ట్/హిస్టరీ షీట్లు తెరవాలని తెలిపారు. ఇదిలా ఉంటే, ఇటీవల ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో సమాచార వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలోనే ఈ విధంగా సోషల్ మీడియాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియా నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా వారిని అదుపు చేయవచ్చనే ఉద్దేశంతోనే ఈ సరికొత్త విధానాన్ని ఎంచుకున్నట్టు రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రజల గొంతు వినిపించొద్దా?
ఇటీవల విద్యార్ధులు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు, భూనిర్వాసితులు తదితర వర్గాలు తమ సమస్యలపై ఆందోళన బాట పడుతున్నాయి. ఆయా వర్గాల నుంచి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం, వాటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం, చర్చ జరగడాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతున్నదనే విమర్శలున్నాయి. పలు యూట్యూబ్ చానెళ్లు ప్రజాఆందోళనలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రజా ఆందోళనలకు ప్రధాన స్రవంతి మీడియాలో చాలా వరకు సముచిత స్థానం లభించకపోవడంతో ప్రజలు ఎక్కువగా సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను అదుపు చేయడం ద్వారా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవచ్చనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటువంటి మెమోను జారీచేసినట్టు విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతంలో సోషల్ మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సందర్భంలో న్యాయస్థానాల నుంచి చుక్కెదురైంది. ప్రభుత్వ చర్యలపై పౌర, ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా మళ్లీ ఆర్థిక పరమైన మోసాలు, సోషల్ మీడియా వేదికగా జరిగే నేరాలను అదుపుచేయడం పైకి చెప్తున్నప్పటికీ… ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేవారిపై హిస్టరీ షీట్లు తెరవాలనేది ప్రభుత్వం కుట్ర అయ్యుంటుందని, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసుశాఖ ఇటువంటి మెమోను జారీచేసినట్టు రాజకీయ నిపుణులు, సోషల్‌మీడియా ప్రతినిధులు పేర్కొంటున్నారు.
గొంతు నొక్కితే ప్రజాయుద్ధం ఆగుతుందా!
కాంగ్రెస్ సర్కారు ప్రజాస్వామిక స్ఫూర్తిని కాలరాస్తున్నదని రాజకీయ విశ్లేషకులు, సామాజిక మాధ్యమాల నిపుణులు, హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు ఉన్నాయని, నేరస్థులను కఠినంగా శిక్షించవచ్చని చెప్తున్నారు. నిరంతరం నిఘా కోసం హిస్టరీషీట్స్, సస్పెక్ట్‌షీట్స్ ఓపెన్ చేశామని పోలీసులు చెప్పడంలో ఎవరికీ అభ్యంతరం లేదని అంటున్నారు. కానీ ఇదే మెమో ముసుగులో సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణచివేసే కుట్ర కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. హక్కులను కాలరాస్తూ ప్రజల గొంతు నొక్కితే మాత్రం.. ప్రజలంతా ఏకమై తిప్పికొడుతారని హెచ్చరిస్తున్నారు. నేపాల్, బంగ్లాదేశ్‌తో పాటు తాజాగా లద్దాక్‌లో జరుగుతున్న పరిణామాల నుంచి ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు.