హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్ శంకర్‌గౌడ్‌కు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ స్పష్టంచేసింది. తమ సమ్మె డిమాండ్లను పరిషరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి విఫలమవడంతోనే కలత చెంది, మనోవేదనతో శంకర్‌గౌడ్ ఆత్మహత్యకు యత్నించారని ఒక ప్రకటనలో తెలిపింది.
70 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఆయనకు ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించాలని జేఏసీ నేతలు కోరారు. ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఇప్పటివరకు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికవర్గంపై సర్కార్ ఉకుపాదం మోపుతున్నదని మండిపడ్డారు. డిపోల్లో వేసుకున్న టెంట్లను పోలీసులతో కూల్చివేయించి అకడి నుంచి నిర్దాక్షిణ్యంగా కార్మికులను తరిమి కొడుతున్నారని తెలిపారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించాలని, సమ్మె డిమాండ్లను పరిషరించి, సమ్మెను విరమింపచేయాలని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు సుద్దాల సురేశ్, కత్తుల యాదయ్య, బీ యాదగిరి ఆ ప్రకటనలో కోరారు. అన్ని డిపోల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించి కార్మికులకు ప్రశాంతపూరిత వాతావరణం కల్పించాలని హితవు పలికారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిషారం కావని, ఐకమత్యంతో కొట్లాడి డిమాండ్లను సాధించుకుందామని కార్మికులకు వారు పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట శుక్రవారం నుంచి చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణను ఆర్టీసీ కార్మిక జేఏసీ ప్రకటించింది. శుక్రవారం అన్ని డిపోల ఎదుట మౌన ప్రదర్శనలు, 25న డిపోలలో వంటావార్పు, 26న అన్ని రీజియన్లలో, జిల్లాల్లో కార్మిక కవాతు, 27న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వినతిపత్రాలు సమర్పించడం, 28న మహిళా ఉద్యోగులతో బతుకమ్మలతో నిరసన ప్రదర్శనలు, 29న అర్ధనగ్న ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చింది.
ఆయా నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని జేఏసీ నేతలు కోరారు. ఈ మేరకు అత్యవసర సమావేశం నిర్వహించినట్టు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి తెలిపారు. కార్మికులను టెంట్ల వద్ద ఇబ్బందులు పెడుతున్న ఘటనలపై డీజీపీ స్పందించాలని కోరారు. కార్మికులు శాంతియుతంగానే నిరసనలు తెలుపుతుంటే.. కొన్నిచోట్ల కార్మికులను పోలీసులు మితిమీరి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలిపారు.