హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : ఓ వైపు ఎడాపెడా భూసేకరణ, మరోవైపు ఇష్టారాజ్యంగా భూముల విక్రయం… ఇదీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పనితీరు. అధికారం కోసం ఇష్టానుసారంగా హామీలు గుప్పించిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు వాటిని నెరవేర్చేందుకు భూముల అమ్మకాన్నే నమ్ముకున్నట్టు కనిపిస్తున్నది. హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతాల్లో 66ఎకరాల భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు విక్రయించి.. రూ.5,000 కోట్లు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. భూముల విక్రయానికి టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీచేసింది. ఇల్లు లేని నిరుపేదలకు 100 గజాలు కేటాయించని ప్రభుత్వం విలువైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయించడం విమర్శలకు తావిస్తున్నది.
రాయదుర్గ్, ఉస్మాన్‌నగర్‌లో 66 ఎకరాలు వేలం వేసేందుకు టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీచేసింది. ఆగస్టు 8 వరకు బిడ్లు స్వీకరించి, 12న వేలం నిర్వహించనుంది. 17చోట్ల ప్లాట్లను విక్రయించనున్నట్టు పేర్కొంది. భూముల అప్సెట్ ధరను కనిష్ఠంగా రూ.12.2 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ. 50.1 కోట్లుగా నిర్ణయించారు. రాయదుర్గ్‌లో గజానికి రూ. 1,51,484 చొప్పున ధర నిర్ణయించారు. దీని ప్రకారం ఎకరం భూమి రూ. 104 కోట్లుగా ఉంది. 66 ఎకరాల్లో 20 ఎకరాలు 4 ప్లాట్లుగా రాయదుర్గ్‌లో, మిగిలిన 46 ఎకరాలు 13 ప్లాట్లుగా ఉస్మాన్‌నగర్‌లో ఉన్నాయి. రాయదుర్గ్‌లో ఆప్సెట్ ధర రూ. 100 కోట్లకుపైగా నిర్ణయించడం విశేషం. విధివిధానాల్లో సలహాదారుల కోసం ఈ నెల 25న టీజీఐఐసీ నోటిఫికేషన్ జారీచేసింది.
వ్యవసాయయోగ్యంకాని భూములను సేకరించి, వాటిని లేఔట్లుగా అభివృద్ధిచేసి.. పరిశ్రమలకు విక్రయించడం టీజీఐఐసీ పని. కానీ కొంతకాలంగా సదరు సంస్థ.. ప్రభుత్వం తరఫున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే మధ్యవర్తిగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదివరకే మన్నెగూడ, కవాడిపల్లి, చందానగర్, మునగనూర్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో అత్యంత విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు టీజీఐఐసీ విక్రయించింది. ఈ భూముల విక్రయం ద్వారా రూ. 21వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చినట్టు సమాచారం. కంచె గచ్చిబౌలి ప్రాంతంలో భూములను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి రూ.10వేల కోట్లు రుణం తీసుకున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల పేరుతో భూసేకరణకు 20కిపైగా నోటిఫికేషన్లు జారీచేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వరకు ఎకరా భూమి రూ.2కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు పలుకుతున్నది. ప్రభుత్వం మాత్రం రూ.15-20 లక్షలకు మాత్రమే సేకరిస్తున్నది. సేకరిస్తున్న భూములను పరిశ్రమల పేరుతో విక్రయించి, ఆ తర్వాత రియల్ ఎస్టేట్‌కు ఉపయోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సంగారెడ్డి ప్రాంతంలో గతంలో పరిశ్రమల పేరుతో కేటాయించిన భూముల్లో.. ఇప్పుడు అపార్ట్మెంట్లు ఏర్పడడమే నిదర్శనం.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో సొంత స్థలం ఉన్నవారికే ఇల్లు మంజూరు చేస్తున్నది. భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం వద్ద ఉన్న భూములను కేటాయించే అంశాన్ని పరిశీలించడంలేదు. ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముకోకుండా పేదలకు కేటాయించాలని ప్రజాసంఘాల నేతలు కోరుతున్నారు.