హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయమే లక్ష్యంగా అధికారులను పరుగులు పెట్టిస్తున్నది. ఈ ఏడాది అదనంగా రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవాలన్న లక్ష్యంతో భూములు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలను అడ్డగోలుగా పెంచేందుకు సిద్ధమవుతున్నది. ఆ క్రమంలో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లను రంగంలోకి దింపింది. కార్యాలయాల్లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో భూములు, ఇతర స్థిరాస్తుల వాస్తవిక ధరలను తెలుసుకుని నివేదికలు రూపొందించాలని వారిని ఆదేశిస్తున్నది. మార్కెట్ విలువల సవరణ కమిటీ పేరుతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ప్లాట్లు, ఇండ్లు, ఫ్లాట్ల బహరింగ మార్కెట్ ధరలను అంచనా వేయిస్తున్నది.
రెండు రోజుల్లోగా నివేదికలు అందజేయాలని గడువు విధించడంతో వారంతా రియల్టర్ల అవతారమెత్తుతున్నారు. ఎర్రటి ఎండల్లో పొలాలు, వెంచర్ల బాట పడుతూ స్థిరాస్తి వ్యాపారుల తరహాలో ఎకరం ఎంత? ప్లాట్లు అయితే గజం ఎంత చెప్తున్నారు? అని ఆరా తీస్తున్నారు. దీన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలను భారీగా పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. రేవంత్రెడ్డి సర్కార్ అనాలోచిత విధానాల వల్ల ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్తుల క్రయవిక్రయాలు నిలిచిపోయాయన్న అధికారిక గణాంకాలను తుంగలో తొక్కుతున్నది. ప్రైవేట్ ఏజెన్సీలు, అరవింద్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన నివేదికలను ప్రామాణికంగా తీసుకొని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలను ఏకంగా మూడు రెట్ల వరకు పెంచాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం అనేక మంది అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లారు.