Congress Govt | హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీలను అటకెకించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలు ఊహించని ఓ కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఈ ఏడాది బడ్జెట్ లక్ష్యాల మేరకు రూ.27 వేల కోట్ల ఎక్సైజ్ ఆదాయాన్ని సముపార్జించడానికి మద్యాన్ని టెట్రా ప్యాకెట్లలో విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నది. పేద ప్రజలు, వ్యవసాయ కూలీలు, సాధారణ రైతులు సులువుగా జేబులో పెట్టుకొని పోయేవిధంగా మద్యం టెట్రా ప్యాకెట్లను అనుమతించాలని నిర్ణయించింది. టెట్రా ప్యాకెట్ అచ్చంగా ఫ్రూటీ ప్యాకెట్ మాదిరిగా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న క్వార్టర్ బాటిల్ విధానంతో అంచనా వేసిన స్థాయిలో మద్యం అమ్ముడుపోవడం లేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకలో అమలవుతున్న టెట్రా ప్యాకెట్ల విధానం వైపు మొగ్గుచూపుతున్నదని ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయం ఫైల్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. దీనికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయడం లాంఛనమేనని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
పేదలు, దిగువ మధ్య తరగతి లక్ష్యంగా..
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉన్న కర్ణాటకలో టెట్రా ప్యాకెట్లలో మద్యం వ్యాపారం లాభసాటిగా సాగుతున్నది. అక్కడి ప్రభుత్వం నిరుపేద, దిగువ మధ్యతరగతి, వ్యవసాయ కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని టెట్రా ప్యాకెట్ల విధానం తీసుకొచ్చింది. కర్ణాటకలో 90 ఎంఎల్, 180 ఎంఎల్ ప్యాకెట్లు విక్రయిస్తుండగా, తెలంగాణలో వీటితోపాటు 60 ఎంఎల్ ప్యాకెట్లు కూడా తేవాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
రూ.140కే కడుపు నిండా మద్యం!
సీసా మద్యంతో పోల్చినప్పుడు టెట్రా ప్యాకెట్ మద్యం మందుబాబులకు రూ.10 నుంచి రూ.15 తకువ ధరకే లభిస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం క్వార్టర్ చీప్ లికర్ ధర రూ.120 ఉన్నది. ఇదే మద్యం టెట్రా ప్యాక్‌లోకి మారితే రూ.105కే లభిస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ లెకన మందుబాబులకు ఒక క్వార్టర్ మద్యం మీద రూ.15 మేర మిగులుతుందని, ఈ రూ.15కు ఇంకో రూ.20 కలుపుకుంటే, ఆ రూ.40తో 60 ఎంఎల్ టెట్రా ప్యాకెట్ కూడా వస్తుందని ఎక్సైజ్ అధికారులు వివరిస్తున్నారు. రూ.5 నీళ్ల ప్యాకెట్, రూ.10 శనగల ఖర్చులు కలుపున్నా… రూ.140కే కడుపు నిండా మద్యం వస్తుందని వారు లెకలు కట్టి మరీ చెప్తున్నారు. మద్యం ధర తగ్గడం వలన ప్రభుత్వ సుంకాల రాబడిలో తేడా రాదని, సీసా తీసేస్తున్నాం కాబట్టి ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయని, ఇది వినియోగదారునికి లాభమని ఎక్సైజ్ అధికారులు వివరిస్తున్నారు.
వెనకి తగ్గిన పలు రాష్ట్రాలు
టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయించాలని గత ఏడాది తమిళనాడు, బీహార్ రాష్ట్రాల్లో అకడి ప్రభుత్వాలు ప్రయత్నించాయి. అయితే, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాయి. రేవంత్‌రెడ్డి సర్కారు మాత్రం సాధ్యమైనంత త్వరలో టెట్రా ప్యాకెట్లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా టెట్రా మద్యం విధానానికి ఎక్సైజ్ శాఖ కమిషనర్ స్థాయిలోనే అనుమతించాలని ఆదేశించినప్పటికీ, ఇది సున్నితమైన అంశం కాబట్టి కమిషనర్ ప్రభుత్వ అనుమతి కోసం ఫైల్‌ను సిద్ధం చేసి పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది.