హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా భద్రతా ప్రమాణాలపై రసాయన, ఫార్మా కంపెనీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని నిశ్చయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ఒకవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సిగాచి కంపెనీ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లడం, మరోవైపు, రాష్ట్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. హరీశ్‌రావు సోమవారం సిగాచి బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా బాధితుల ఇబ్బందులను తెలుసుకొని వారికి అన్నివిధాల అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. దీంతో అలర్టయిన ప్రభుత్వం పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలపై అదే రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. కంపెనీలు పాటించాల్సిన నిబంధనలు, కార్మికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సమగ్రంగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది.
పరిశ్రమలపై చర్యల విషయం అత్యంత సున్నితమైన అంశంగా మారింది. కంపెనీలపై ఎటువంటి చర్యలు చేపట్టినా బయటకు వేరే విధంగా సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నదని, దాని ప్రభావం పెట్టుబడులపై పడుతుందన్న ఉద్దేశంతో సర్కారు ఆచితూచి వ్యవహరిస్తున్నది. ప్రభుత్వం వైపు నుంచి కూడా తనిఖీలు లేకపోవడం, ప్రశ్నించేవారు లేకపోవడంతో కంపెనీలు ఆడిందే ఆటగా తయారైంది.
కంపెనీలను పర్యవేక్షించాల్సిన ఫ్యాక్టరీల విభాగంలో తీవ్ర సిబ్బంది కొరత నెలకొన్నది. డైరెక్టరేట్ కార్యాలయంలో తనిఖీలు చేసేందుకు కనీసం 100 మంది ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే పనిస్తున్నారు. పెరిగిన కర్మాగారాల సంఖ్యకు అనుగుణంగా కనీసం 100 మంది ఇన్స్పెక్టర్లు అవసరమవుతారని అధికారవర్గాలు చెప్తున్నాయి. మరోవైపు, రాష్ట్రంలో దాదాపు 21,511 కర్మాగారాలు రిజిస్టరై ఉండగా, వాటిలో పనిచేస్తున్నవి 16,534 ఉన్నాయి. వీటిలో ఎనిమిది లక్షలకుపైగా కార్మికులు పనిచేస్తున్నట్టు కర్మాగారాల విభాగం చెప్తున్నది. ఇందులో ప్రమాదకర కర్మాగారాలు (హైరిస్క్) దాదాపు ఐదు వేలవరకు ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు. ఎలాగూ పర్యవేక్షించే అవకాశం లేకపోవడంతో ఇటు కర్మాగారాలు, అటు కార్మిక శాఖ అధికారులు తూతూమంత్రంగా నెలవారీ మామూళ్లు పుచ్చుకొని మౌనం వహిస్తున్నట్టు విమర్శలున్నాయి.