కేంద్రం రుద్దిన డిజిటల్ క్రాప్ సర్వే చేయలేమంటూ ఏఈవోలు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే అకస్మాత్తుగా మంగళవారం మధ్యాహ్నం రేవంత్ ప్రభుత్వం వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ టైమింగ్ వెనక ఒక మర్మం దాగిఉన్నది. అదేమిటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ఉదయం తమ కార్యాచరణను ప్రకటించింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఏఈవోలపై వేటు వేయడం, ప్రతిరోజూ వందల సంఖ్యలో సస్పెన్షన్లు చేయాలని నిర్ణయించడం మిగతా ఉద్యోగులను, ఉద్యోగ సంఘాలను బెదిరించి భయపెట్టడానికేనా?
AEO | హైదరాబాద్, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): డిజిటల్ క్రాప్ సర్వే చేయని వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై వ్యవసాయ శాఖ కక్షసాధింపు చర్యలకు దిగింది. తమ మాట వినడంలేదనే కోపంతో రైతుబీమాలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణం చూపుతూ తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. మంగళవారం ఒక్కరోజే 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం నుంచి మొదలైన సస్పెన్షన్ల పరంపర సాయంత్రం వరకు కొనసాగింది. జిల్లాకు కనీసం 5-10 మం దిని సస్పెండ్ చేసినట్టుగా తెలిసింది.
దారికొచ్చేవరకు సస్పెన్షన్లు
ఏఈవోలు దారికి వచ్చే వరకు ప్రతిరోజు కొంతమందిపై వేటు వేయాలనే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టుగా తెలిసింది. ఏదో ఒక కారణంతో ప్రతి రోజు కనీసం 100 మం దిపై వేటు వేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. మొదట కొంతమం ది ఏఈవోలపై వేటు వేస్తే మిగిలిన ఏఈవోల్లో భయం ఏర్పడుతుందని, అప్పుడే దారికొస్తారని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టుగా తెలిసింది. డిజిటల్ క్రాప్ సర్వే చేయకపోవడమే 165 మంది ఏఈవోల సస్పెన్షన్‌కు కారణం అనేది బహిరంగ రహస్యం. ఉన్నతాధికారులు మాత్రం రైతుబీమా నిబంధనల ప్రకారం మృతి చెందిన రైతుల వివరాల నమోదులో ఏఈవోలు నిర్లక్ష్యంగా వహించారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రైతుబీమా కారణం చూపి..
నిబంధనల ప్రకారం రైతు చనిపోయిన తర్వాత నాలుగు రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు అన్ని రకాల పత్రాలను జత చేసి.. సదరు ఏఈవో రైతుబీమా పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాలి. కానీ రైతు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కనీ సం 11 రోజుల వరకు బయటకు వచ్చే పరిస్థి తి ఉండదు. వివరాలు అందించేందుకు కనీ సం 15 రోజుల సమయం పడుతుంది. అ లాంటప్పుడు నాలుగు రోజుల్లో వివరాలు ఏ విధంగా ఆప్‌లోడ్ చేయాలని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోకుండా తమపై కక్షగడితే ప్రయోజనం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే… సస్పెన్షన్ ఉత్తర్వుల్లో అధికారులు చూపిన కారణంతో ఏ ఒక్క రైతు కుటుంబానికి కూడా రైతుబీమా పరిహారం అందని పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఏఈవోలపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
మూకుమ్మడి సెలవులో 2600 మంది ఏఈవోలు…!
తోటి ఉద్యోగులను సస్పెండ్ చేయడాన్ని ఏఈవోలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇక ప్రభుత్వంతో తాడోపేడో తెల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృ తం చేయాలని నిర్ణయించారు. తాము సామరస్యంగా ముందుకెళ్తుంటే అధికారులు మా త్రం రెచ్చగొట్టే ధోరణి అవలంభిస్తున్నారని వా రు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను నిర్వహించాలని నిర్ణయించినట్టు ఏఈవోలు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే, సస్పెన్షన్లను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2600 మంది ఏఈవోలమంతా మూకుమ్మడి సెలవు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.
కమిషనరేట్‌లో ధర్నా… పట్టించుకోని డైరెక్టర్
165 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడంపై ఇతర ఏఈవోలు భగ్గుమన్నారు. సస్పెన్షన్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఏఈవోలు హై దరాబాద్‌లోని వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌కు తరలివచ్చారు. సాయంత్రం భారీ సంఖ్యలో చేరుకున్న ఏఈవోలు అక్కడే ధర్నాకు దిగారు. సస్పెన్షన్లను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. డైరెక్టర్ గోపిని కలిసేందుకు ఏఈవో లు ప్రయత్నించగా ఆయన అపాయింట్మెం ట్ ఇవ్వలేదు. డైరెక్టర్ ఆఫీసు నుంచి బయటకు వెళ్లే సమయంలో ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా పట్టించుకోకుండా వెళ్లిపోయినట్టుగా ఏఈవోలు తెలిపారు. ప్రభు త్వం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా డిజిటల్ క్రాప్ సర్వే చేయబోమని స్పష్టం చేస్తున్నారు. ‘ఏసీ రూముల్లో కూర్చున్న వాళ్లకేం తెలుసు మా కష్టాలు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్‌లో ఉండి మస్తు ఆదేశాలు జారీ ఇవ్వొచ్చు’ అని ఓ ఏఈవో ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏఈవోలపై వేటు అప్రజాస్వామికం
డిజిటల్ క్రాప్ సర్వేకు ఒప్పుకోలేదని ఏఈవోలపై వేటు వేయడం అప్రజాస్వామికం. ప క్క రాష్ట్రాల్లో ఏజెన్సీలు, ఇతర శాఖలతో డిజిటల్ క్రాప్ సర్వే చేపడుతుంటే రాష్ట్రంలో ఏఈవోల నెత్తిన రుద్దడం ఎంతవరకు సమంజ సం. ఇప్పటికే 49 రకాల విధులు నిర్వర్తిస్తు న్న వారిపై అదనపు భారం మోపవద్దు. బెదిరించడం, ఉద్యోగులను విభజించడమే ప్రజాపాలనా? ప్రభుత్వం డిజిటల్ సర్వేను ఏజెన్సీలకు అప్పగించాలి.
– నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి
సర్వే ఏఈవోల ప్రాథమిక బాధ్యత
పంట నమోదు ఏఈవోల ప్రాథమిక బాధ్యత. రైతు బీమా, రైతు భరోసా పథకాలకు సర్వే ఉపయోగపడుతుంది. సర్వేను సక్రమంగా నిర్వహించకుంటే రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని కోల్పోతారు. దీనిని మెరుగ్గా, పటిష్ఠంగా నిర్వహించాలని ఏఈవోలకు నెల క్రితమే ఉత్తర్వులు జారీ చేశాం. కొందరు ఏఈవోలు పంట పొలాన్ని సందర్శించకుండా సర్వే కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు.
– డాక్టర్ గోపి , వ్యవసాయశాఖ సంచాలకుడు
సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి
డిజిటల్ క్రాప్ సర్వే పేరిట ప్రభుత్వం ఏఈవోలను వేధించడం అన్యాయం. పనిభారం పెరుగుతుందని, దశల వారీగా చేస్తామని చెబుతున్నా పట్టించుకోకపోవడం సరైంది కాదు. ఒకేసారి ఇంతమందిపై వేటు వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పటికైనా ఏఈవోలను చర్చలకు పిలువాలి. బేషరతుగా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి.
-దేవిప్రసాద్ , ఉద్యోగ సంఘాల మాజీ చైర్మన్