హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైజింగ్ పేరుతో కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వ అధికారులే హడావుడి చేశారు. ప్రభుత్వ ఆదేశాలో లేక సొంత నిర్ణయమో తెలియదు కానీ.. సూటు, బూట్లలో ప్రభుత్వాధికారులు సమ్మిట్ డెలిగేట్స్‌తో పోటీపడ్డారు. గ్లోబల్ సమ్మిట్‌కు మొత్తం 1,500 నుంచి 2,000 మంది డెలిగేట్స్‌ను ఆహ్వానించామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. కానీ ఆశించిన స్థాయిలో విదేశీ డెలిగేట్స్ రాకపోవడంతో ఆ సీట్లను అధికారులు భర్తీ చేసినట్టు కనిపించింది. మొదటి వరసలోని అతిథుల సీట్లు మినహా.. మిగిలిన సీట్ల వరుసలో అక్కడక్కడ విదేశీయులు కనిపించారు. మొదటి మూడు వరుసలు మినహా.. ఎక్కడ చూసినా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులే బ్లాక్, బ్లూ సూట్లలో కనిపించారు.
ఇక వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు ముందువరుసలో ఆసీనులయ్యారు. ఎగ్జిబిషన్ కోసం వచ్చిన అధికారులను సైతం సమ్మిట్‌కు తీసుకొచ్చి వారితో కూడా సీట్లను భర్తీ చేయించారు. సమ్మిట్‌కు చుట్టుపక్కలనున్న ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థులకు బ్లాక్, బ్లూ బ్లేజర్లు వేసి డెలిగేట్ ఐడీ కార్డులు ఇచ్చి పంపారు. చాలావరకు బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్న విద్యార్థుల సందడి కనిపించింది. సభా ప్రాంగణం వెనుకభాగంలో కూ డా అక్కడ పనిచేసే సిబ్బంది కూర్చోవడంతో మొత్తం నిండుగా కనిపించింది. ప్రధాన వేదికకు ఇరువైపులా 200 మంది వరకూ యువ పోలీసు ఆఫీసర్లే సూట్లు వేసుకొని భద్రతా విధుల్లో పాల్గొన్నారు. ఎక్కువసేపు నిల్చులేక వారు కూడా సీట్లలో కూర్చుకున్నారు. వారితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ, 200 మంది వరకూ మీడియా ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు. రంగారెడ్డి, మహేశ్వరం వంటి ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది కాంగ్రెస్ నాయకులు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్‌లో కనిపించారు. ముఖ్యఅతిథుల ప్రసంగాలు భోజన విరామం తర్వాత ప్రారంభం కావడంతో చాలామంది కునుకుతీస్తూ కనిపించారు. చాలామంది సమ్మిట్‌లో ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేశారు.