హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): సన్న వడ్లకు (Fine Rice) బోనస్ (Bonus) చెల్లింపుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. రైతులకు గత యాసంగి బోనస్‌ను ఎగ్గొట్టిన సర్కారు ఈ వానకాలంబోనస్లోనూ అరకొరగా చెల్లిస్తున్నది. ఈ సీజన్లో ప్రభుత్వం సుమారు 15 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో ఎనిమిది లక్షల టన్నులు దొడ్డు ధాన్యం కాగా, ఏడు లక్షల టన్నులు సన్నధాన్యం ఉన్నది. సన్న వడ్లు విక్రయించిన రైతులకు బోనస్ కింద క్వింటాల్‌కు రూ.500 చొప్పున 7 లక్షల టన్నులకు రూ.350 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. కానీ, ఇప్పటివరకు రూ.35 కోట్లు మాత్రమే చెల్లించినట్టు తెలిసింది. ఇంకా రూ.315 కోట్లు బకాయి పెట్టింది.
రైతులకు 1200 కోట్లు బాకీ
బోనస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి యాసంగిలో బోనస్ ఇవ్వకుండా రూ.1,159.64 కోట్లు బకాయిపెట్టింది. గత యాసంగిలో మొత్తం 74.22 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో సన్నధాన్యం 23.19 లక్షల టన్నులు ఉన్నది. ఇందుకుగాను 4.09 లక్షల మంది రైతులకు బోనస్ కింద రూ.1,159.64 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. రైతులు ధాన్యం విక్రయించి ఏడు నెలలైనా, వానకాలం పంట చేతికొచ్చి, ధాన్యం కొనుగోళ్లు మొదలైనప్పటికీ యాసంగి బోనస్‌ను చెల్లించలేదు.