హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : ఇన్ సర్వీస్ పీజీ అర్హత కలిగిన వైద్యులను లాటరల్ ఎంట్రీ విధానంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్(టీపీహెచ్‌డీఏ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు కత్తి జనార్దన్, రాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పనిచేస్తున్న వారిని డీఎంఈలో నియమించడం ద్వారా అధ్యాపకుల కొరత తీర్చవచ్చని సూచించారు. దీంతో పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్య సేవలకు ఆటంకాలు తొలగిపోతాయని వివరించారు. అర్హత కలిగిన ఇన్ సర్వీస్ పీజీ వైద్యుల లాటరల్ ఎంట్రీ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించినట్టు ప్రతినిధులు తెలిపారు.