రఘునాథపాలెం, జూలై 30: ఖమ్మంలో కాంగ్రెస్ గూండాల అరాచకం పేట్రేగిపోతోంది. వారి చేష్టలు నగర ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ఉంటున్నాయి. అధికారం అనే అహంతో సాధారణ జనంపై అకారణంగా దాడులకు తెగబడుతున్నాయి. బీఆర్ఎస్ నేతల ఇళ్లపైనా దాడుల చేసిన ఘటనలు అనేకం. ఇప్పుడు గులాబీ పార్టీ గద్దెలపైనా తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఖమ్మం నగరం 8వ డివిజన్ పరిధి వైఎస్ఆర్ నగర్లో బుధవారం అర్ధరాత్రి బీఆర్ఎస్ దిమ్మెను కూల్చి వేశారు. రాత్రికి రాత్రే కాలనీలో ఉన్న బీఆర్ఎస్ గద్దె ఆనవాళ్లు లేకుండా చేశారు. పార్టీ దిమ్మె కూల్చివేతపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ దిమ్మెను ఆవిష్కరించిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ మూకలు దానిని కూల్చివేయడంపై తీవ్రంగా మండిపడ్డారు.
ఈ మేరకు వైఎస్ఆర్ నగర్లో కాంగ్రెస్ అరాచక శక్తులు కూల్చిన పార్టీ దిమ్మె స్థలాన్ని బీఆర్ఎస్ ఖమ్మం నగర నేతలు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్ గులాబీ దిమ్మె కూల్చివేసిన ప్రదేశంలో విలేకరులతో మాట్లాడారు. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు వస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెగబడుతోందని ఆరోపించారు. ఖమ్మంలో కాంగ్రెస్ అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయనడానికి బీఆర్ఎస్ గద్దెల కూల్చివేతలే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చివేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆమధ్య చేసిన వ్యాఖ్యలను జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుసరిస్తున్నారని ఆరోపించారు.
దిమ్మెలను కూల్చినంత మాత్రాన తమ పార్టీ అంతమయ్యేది కాదనే విషయాన్ని గుర్తించుకోవాలని హితవుచెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. అభివృద్ధిపై దృష్టి సారించకుండా ప్రతిపక్షంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే కాంగ్రెస్ అరాచక శక్తులకు భవిష్యత్తులో తమ పార్టీ తగిన విధంగా బుద్ధి చెబుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బత్తుల మురళి, కూరాకుల వలరాజు, నాగండ్ల కోటి, దేశభక్తుని కిశోర్‌బాబు, గొల్లపూడి రాంప్రసాద్, సురేశ్‌నాయక్, వీరేందర్ గౌడ్, షకీనా, మాటేటి కిరణ్, ఉస్మాన్, వేగినాటి మధు, భుక్యా అశోక్, సద్దాం, దినేశ్, సతీశ్, రమేశ్, కొమరయ్య, మల్లేశ్, వెంకన్న, గాంధీ, నరేశ్, రమేశ్, ఉపేందర్, వెంకట్, ప్రవీణ్, రాజ్యలక్ష్మి, బీక్యా పాల్గొన్నారు.