హైదరాబాద్, మే9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగూడెంలో అట్టహాసంగా ప్రారంభించిన దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆదిలోనే ఆపసోపాలు పడుతున్నది. సరిపడా నిధుల కేటాయింపులు జరుగక, ఫ్యాకల్టీలేక తడబడుతున్నది. విద్యార్థుల ప్రవేశాల్లేక విశ్వవిద్యాలయం వెలవెలబోతున్నది. యూనివర్సిటీ పట్ల కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపుతోనే ఈ దుస్థితి నెలకొన్నది. 2026-27 బడ్జెట్లో రూ.300 కోట్లు ప్రతిపాదించగా కేవలం రూ.45 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నతీరే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది..
కేఎస్ఎంను మైనింగ్ వర్సిటీగా మార్చి..
1978లో ఏర్పడిన కేఎస్ఎం (కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్) ఇంజినీరింగ్ కాలేజి తొలుత ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేది. ఆ తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం సదరు కాలేజీని డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ యూనివర్సిటీగా మార్చింది. ఇందులో బీటెక్, బీఎస్సీ, ఎమ్మెస్సీ ద్వారా మైనింగ్, జియాలజీ, ఎర్త్సైన్స్ కోర్సులను ప్రారంభించింది. సింగరేణి సీఎస్ఆర్ నిధులతో ఒకటి, రెండు కొత్త భవనాలను నిర్మించింది. ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. కనీసం ప్రహరీ కూడా నిర్మించకుండా అందుబాటులోకి తెచ్చింది.
అట్టహాసంగా ప్రారంభం..
సింగరేణి నిధులతో కొత్తగూడెంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరిట ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేశారు. గత డిసెంబర్ 2న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యూనివర్సిటీని అట్టహాసంగా ప్రారంభించారు. దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అని గొప్పలు చెప్పారు. పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఆచరణలో మాత్రం నిధులివ్వకపోవడంతో కొత్త భవనాలు నిర్మించకుండా ఇరుకు గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఫ్యాకల్టీని నియమించకపోవడంతో గెస్ట్ లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నారు. మౌలిక వసతుల కల్పన, కొత్త నియామకాలు, భవనాల నిర్మాణం ఇతరత్రా సౌకర్యాల కోసం రూ.300 కోట్లు ప్రతిపాదించారు. కానీ కేవలం రూ.45 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు సిబ్బంది వేతనాలకే సరిపోతాయని, ఇక కొత్త భవనాల నిర్మాణం, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం ఎలా సాధ్యమని పెదవివిరుస్తున్నారు.
హామీలు నీటిమూటలు
యూనివర్సిటీ పరిధిలోని హాస్టల్ విద్యార్థులకు భోజనం, ఇతరత్రా వసతుల కల్పనకు విశ్వవిద్యాలయ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. విద్యార్థుల భోజనాలకు సంబంధించి మెస్ బిల్లులు రాకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తున్నదని వర్సిటీ పెద్దలు వాపోతున్నారు. ఫ్యాకల్టీని నియమించకపోవడంతో వివిధ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. ప్రస్తుతం 900 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క కొత్త అడ్మిషన్ లేకపోవడం చర్చనీయాంశమైంది.