హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హిందూ ఆలయాలపై కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత వైఖరి అవలంబిస్తున్నది. 9 నెలల్లో ఒక్క ఆలయానికీ నయాపైసా కేటాయించని ప్రభుత్వం.. గత కేసీఆర్ సర్కారు చేపట్టిన పనులను ఒక్క కలం పోటుతో రద్దుచేసింది. ఇప్పటికే సీజీఎఫ్ పన్నును 12 శాతానికి పెంచగా, తాజాగా రూ.380 కోట్ల అభివృద్ధి పనులను రద్దుచేశారు. 150 గ్రామీణ ఆలయాలను సీజీఎఫ్ నిధులతో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలనూ బుట్టదాఖలు చేశారు. ధూప దీప నైవేద్యం ఆలయాలకు 3 నెలలుగా వేతనాలను నిలిపివేశారు. ఆలయాలపై ప్రభుత్వ అవలంబిస్తున్న వివక్షను ధార్మిక సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి.
గడచిన తొమ్మిదిన్నరేండ్లు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఆలయాలకు వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా భక్తుల విజ్ఞప్తి మేరకు నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధులను (ఎస్డీఎఫ్) కేటాయించి యాదగిరిగుట్టతోపాటు వివిధ ప్రధాన ఆలయాలను ఆలయాలను అభివృద్ధి చేసింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో పునర్నిర్మించారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల కోసం 35 ఎకరాల భూమిని సేకరించడంతోపాటు ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్ల వరకు ఖర్చుచేశారు.
కొండగట్టు ఆంజనేయస్వామి, బాసర జ్ఞానసరస్వతి, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం రామాలయం ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి నిధులు కేటాయించారు. ఇదే క్రమంలో జిల్లాల వారీగా ప్రధాన ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి దశలవారీగా పనులు చేపట్టాలని నిర్ణయించారు. కొన్ని పనులు పురోగతిలో ఉండగా, మరికొన్నింటిని ప్రారంభించాల్సి ఉన్నది. ఇందులో 23 ఆలయాలకు సంబంధించి రూ.380 కోట్ల పనులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత వారం రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన దేవాదాయ శాఖ మంత్రి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన, చేపట్టిన పనులన్నింటినీ రద్దుచేయాలని అధికారులను ఆదేశించారు.
సీజీఎఫ్ నిధుల ద్వారా 150 గ్రామీణ ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలను నేటి సర్కారు నీరుగార్చింది. స్థానికులు రూ.3 లక్షలు ఖర్చు పెట్టుకుంటే.. ప్రభుత్వం సీజీఎఫ్ ద్వారా ఒక్కో ఆలయాలనికి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయాలనేది ఈ ప్రతిపాదన. ఈ ప్రతిపాదననూ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసింది. ఒక్క కొత్త ఆలయాన్ని కూడా ఈ పథకంలో చేర్చకపోగా, గతంలో మంజూరు చేసిన 7,000 పైచిలుకు ఆలయాలకు 3 నెలలుగా వేతనాలు ఇవ్వడమే లేదు. దీంతో కొన్నిచోట్ల ధూప దీప నైవేద్యాలు నిలిచిపోయినట్టు అర్చక సంఘాలు ఆవేదన చెందుతున్నాయి.