హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు మెడికల్ కళాశాలల (యూజీ ఇంటర్న్షిప్, పీజీ) విద్యార్థుల స్టైపెండ్ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ అంశాన్ని ఎన్ఎంసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తామని డీఎంఈ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఇంటర్న్స్, పీజీ విద్యార్థుల బృందం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో స్టైపెండ్ సమస్యను వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
టీజీఎంసీ కార్యాలయంలో చైర్మన్ డా.మహేష్, డీఎంఈ, తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చైర్మన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు స్పందిస్తూ స్టైపెండ్ ఫీజు, అక్రమ ఇన్స్టంట్ ఫీజు వసూలుపై ప్రైవేటు కాలేజీలకు నోటీసులు జారీ చేస్తామని విద్యార్థులకు తెలిపారు. రెండు మూడు రోజుల్లో ప్రిన్సిపాళ్లు, డీన్లకు అధికారిక నోటీసులు పంపించనున్నట్టు తెలిపారు.
ఆరోగ్య శాఖ మంత్రిని సైతం విద్యార్థుల బృందం కలవగా స్టైపెండ్ విషయమై ఇప్పటికే ప్రైవేటు కాలేజీ మేనేజ్మెంట్లను హెచ్చరించినట్టు తెలిపారు. శనివారం ఎన్ఎంసీ చైర్మన్తో ఈ విషయమై చర్చిస్తామని హామీ ఇచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ‘మెడికోల స్టైపెండ్ పోరు’ పేరిట ఆదివారం కథనం ప్రచురితమైంది. దీంతో వైద్య, ఆరోగ్య శాఖలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం కాగా వెంటనే సమస్య పరిష్కరిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు వైద్య విద్యార్థులకు హామీ ఇచ్చారు.