హైదరాబాద్ మే 22 (నమస్తే తెలంగాణ) : హైడ్రా ముసుగులో కాంగ్రెస్ సర్కారు దుర్మార్గాలకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. పేదల ఇండ్లు కూలగొట్టి, పెద్దలను భయపెడుతూ యథేచ్ఛగా దోచుకొని, ఢిల్లీ పెద్దలకు మూటలు పంపుతున్నదని గురువారం ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో చట్టం సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి చుట్టంలా మారిందని ధ్వజమెత్తారు. ఇదేనా రేవంత్ మార్క్ ప్రజాపాలనా? హైడ్రా పేరిట కూల్చడం మీకు ఓ గంట పని, కానీ ఓ ఇల్లు కట్టాలంటే పేదలు జీవితాంతం కష్టపడాలి.
ఈ విషయం మీరు గుర్తించాలి అని పేర్కొన్నారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా వారి నివాసాలను నేలమట్టం చేయడం దారుణమని ధ్వజమెత్తారు. రేవంత్ సోదరుడి ఇంటికి సంబంధించి నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం, పేదలకు నోటీసులు ఇవ్వకుండా వారి నివాసాలను రాత్రికిరాత్రే పడగొట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. కూల్చడం తప్పా కట్టడం తెలియని కాంగ్రెస్ రాజకీయ కోటలను ప్రజలు బద్ధలుకొట్టే రోజు దగ్గరలోనే ఉన్నదని హెచ్చరించారు. చట్టాలపై సీఎం రేవంత్‌రెడ్డికి ఎలాంటి గౌరవం లేదు.. హైడ్రా విషయంలో హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా బుద్ధి రావడంలేదు అంటూ సర్కారు, రేవంత్ వైఖరిని ప్రశాంత్‌రెడ్డి తూర్పారాబట్టారు.