హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌తోపాటు దాని పరిసర ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డుకు ఉన్న అత్యంత విలువైన భూములపై ప్రభుత్వం కన్నేసింది. వీటి విక్రయానికి విధివిధానాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆ భూముల వివరాలను ప్రభుత్వానికి సమర్పించిన అధికారులు.. ప్రస్తుతం వాటి చుట్టూ ప్రహరీల నిర్మాణం చేపట్టారు. ఏపీ, తెలంగాణల మధ్య ఆస్తుల పంపకం పూర్తయిన వెంటనే ఆ భూములను విక్రయించనున్నట్టు తెలుస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు ఇండ్లు నిర్మించాలనే ఉద్దేశంతో దశాబ్ధాల క్రితం ఏర్పాటైన హౌసింగ్ బోర్డు కాలక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్, గృహకల్ప లాంటి సంస్థల ఏర్పాటుతో ప్రాభవాన్ని కోల్పోయింది. అయినప్పటికీ ఇంకా హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతా ల్లో హౌసింగ్ బోర్డుకు విలువైన భూములు ఉన్నాయి. గతంలో ఈ బోర్డు పరిధిలో 4,759 ఎకరాల భూములుండగా.. వాటిలో 3,820 ఎకరాల్లో కాలనీలు నిర్మించి విక్రయించారు.
మిగిలిన 939 ఎకరాల్లో లీజులు, కోర్టు కేసుల భూములు పోగా ప్రస్తుతం 703 ఎకరాల భూములు వివాదాల్లేకుండా క్లియర్‌గా ఉన్నాయి. వీటిలో సింహభాగం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఉండడంతో విలువ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములపై దృష్టి సారించింది. టీజీఐఐసీ, హెచ్ఎండీఏ భూముల తరహాలో హౌసింగ్ బోర్డు భూములను కూడా విక్రయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అందుకు సరిపడా బడ్జెట్లో నిధులను కేటాయించలేదు. హౌసింగ్ బోర్డు భూముల విక్ర యం ద్వారా వచ్చే నిధులతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో హౌసింగ్ బోర్డు ఆధీనంలోని భూములు, భవనాల వివరాలతో కూడిన నివేదికను అధికారులు ఇటీవల ప్రభుత్వానికి సమర్పించారు.
హౌసింగ్ బోర్డు భూముల విక్రయానికి సర్కారు సిద్ధమైనప్పటికీ హౌసింగ్ బోర్డు ఆస్తులు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్నాయి. దీంతో రెండు రాష్ర్టాల పరస్పర అంగీకారం మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ ఆస్తుల పంపకం జరగాల్సి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ర్టాల వాటాలను తేల్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
అయినప్పటికీ హౌసింగ్ బోర్డు ఆధీనంలోని భూములపై తెలంగాణకే పూర్తి హ క్కులు ఉన్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం విక్రయించుకోవచ్చని కొందరు అధికారులు చెప్తుంటే.. 9వ షెడ్యూల్లో ఉన్న ఆ భూములను కేంద్రం నుంచి క్లియరెన్స్ వచ్చేవరకు విక్రయించే వీలులేదని మరికొందరు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య సత్సంబంధాలు ఉన్నందున ఆస్తుల పంపకం త్వరలోనే పూర్తవుతుందని, ఆ వెంటనే హౌసింగ్ బోర్డు భూముల విక్రయం ఖాయమన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.