హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మొక్కల పెంపకంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదని పర్యావరణవేత్తలు, ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ అద్భుతంగా అమలు చేసిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం పేరు మార్చిన కాంగ్రెస్ సర్కారు.. నిరుడు నుంచి వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటుతున్న ది. ఈ ఏడాది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్భాటంగా ప్రారంభించిన వనమహోత్సవం కార్యక్రమం లక్ష్యం చేరుకోలేదు. పథకం ప్రారంభించి చేతులు దులుపుకున్న సీఎం, మంత్రులు కనీసం సమీక్ష చేయకపోవడంతో అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వనమహోత్సవం ప్రారంభం సందర్భంగా 2025లో 18 కోట్ల మొక్కలు నాటుతామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ వర్షాకాలం ముగుస్తున్నా 14.75 కోట్ల మొక్కలు మాత్రమే నాటినట్టు అధికారులు చెప్తున్నారు. ఇంకా 3.25 కోట్ల మొక్కలు ఇంకా నాటాల్సి ఉంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ‘తెలంగాణకు హరితహారం’ పండుగ వాతావరణంలో అద్భుతంగా అమలయిందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. లక్ష్యానికి మించి కూడా మొక్కలు నాటిన సంవత్సరాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. మొక్క ల పెంపకపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడుతున్నారు.