హైదరాబాద్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ) : విద్యుత్తు పంపిణీ కోసం ప్రభుత్వం మూడో డిస్కంను ఏర్పాటు చేసింది. ఈమేరకు ప్రభుత్వం బుధవారం జీవో జారీచేసింది. లోటు, ప్రభుత్వ బకాయిలను కూడా కొత్త డిస్కం ఖాతాలోనే వేసింది. ఈ మూడింటి విలువ రూ.71వేల కోట్ల పైమాటే. ఇప్పుడున్న రెండు డిస్కంలకు ప్రభుత్వ మొండిబకాయిలు రూ.45,398 కోట్లు. వీటిలో రూ.35,982 కోట్లను మూడో డిస్కంకు బదలాయించారు. జెన్కోకు, సింగరేణికి డిస్కంలు రూ.31,697 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇవి కూడా బకాయిలే. వీటిలో 26,950 కోట్లను మూడో డిస్కంకు బదలాయించారు. 9,032 కోట్ల రుణాలను సైతం మూడో డిస్కం ఖాతాలోనే వేసింది. మొత్తం రూ.71,964 కోట్ల అప్పులు, బకాయిలతో మూడో డిస్కం ఆవిర్భవించింది.
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తు పథకాలన్నింటినీ మూడో డిస్కం పరిధిలోకి తెస్తారు. ప్రస్తుతం దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ 15 జిల్లాలకు, ఉత్తర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ 18 జిల్లాలకు సేవలు అందిస్తున్నది. వ్యవసాయ ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ, ఎత్తిపోతల పథకాలు, మున్సిపల్ వాటర్ సప్లయ్ కనెక్షన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విద్యుత్ కనెక్షన్లు కలిపి మొత్తం 29,08,138 విద్యుత్తు కనెక్షన్లను కొత్త డిసంకు బదలాయిస్తారు.
రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం(ఆర్డీఎస్ఎస్)లో రాష్ట్రం చేరింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 5,22,479 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్మీటర్లను బిగిస్తారు. వాటిని బిగించేందుకు ఒక్కో స్మార్ట్మీటర్కు రూ.25వేల చొప్పున రూ.1,306 కోట్లు ఖర్చవుతుందని సర్కారు పేర్కొన్నది. ఇందుకోసమే ప్రత్యేక డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్న కనెక్షన్లను మాత్రమే మూడో డిసం కేటాయించింది. అయితే గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునందిస్తున్న కనెక్షన్లు, విద్యాసంస్థలకు ఉచిత వి ద్యుత్తునందించే కనెక్షన్లను మూడో డిస్కం పరిధిలోకి చేర్చలేదు. ఇవి పాత డిస్కంల పరిధిలోనే ఉంటాయి.
