Government Lands | మేడ్చల్, ఆగస్టు10(నమస్తే తెలంగాణ): గూగుల్ మ్యాప్‌లోనూ ప్రభుత్వ భూముల వివరాలు గుర్తించవచ్చు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను ఎంపిక చేసి ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రభుత్వ నిబంధనలమేరకు కచ్చితమైన ప్రమాణాలతో జిల్లాలోని నిషేధిత భూములు, రక్షణశాఖ, అటవీశాఖ, సీలింగ్, అసైన్డ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల భూములను సర్వే చేయనున్నారు. గుర్తించిన భూములను కేఎంఎల్ మ్యాప్(గూగుల్)లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పక్కాగా పొందపరచనున్నారు.
ఈ భూముల వివరాలు మండల, డివిజన్, జిల్లా స్థాయి కార్యాలయాలలో శాశ్వత రికార్డులుగా సిద్ధం చేసి భద్రపరచనున్నారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భూములకు అధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ భూములను పరిరక్షణకు ఈ సర్వేను నిర్వహిస్తున్నట్టు రెవెన్యూ అధికారులు వెల్లడిస్తున్నారు.
ప్రభుత్వ భూములపై రెవెన్యూ అధికారులు నిర్వహించనున్న సర్వేలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల లెక్క తెలనున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలలో గత రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూములు 5,195 ఎకరాలు ఉండగా అసైన్డ్ భూములు 11,201 ఎకరాలు ఉన్నాయి. పేదలకు అసైన్డ్ చేసిన భూములన్నీ రియల్టర్ల కబ్జాలో ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ భూములు ఉన్నా యా ? కబ్జాలో ఉన్నాయా? అనే దానిపైనా అధికారులు చెప్పలేకపోతున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టనున్న సర్వేలో ప్రభుత్వ భూముల వివరాలు తెలిపోనున్నాయి. భూ పరిరక్షణకు టాస్క్‌ఫోర్స్ బృందాలు లేకపోవడంతో ప్రభుత్వ, అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు.