Vikarabad | వికారాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): వికారాబాద్లో అధికారపక్ష నేతలు, అవినీతి అధికారుల కారణంగా రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలవుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలంటూ ఓ పక్క నోటీసులు ఇస్తూనే, మరోపక్క రాత్రికి రాత్రే నిర్మాణాలు ప్రారంభిస్తున్నా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తున్నది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి సర్వే నంబర్ 290, 291, 292లో 27 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ భూమిలో 4 ఎకరాలు డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటాయించగా మిగతా 23 ఎకరాల 25 గుంటల భూమి ఉన్నది. సంబంధిత భూమిలో కొందరు వ్యక్తులు దాదాపు మూడున్నర ఎకరాల వరకు కబ్జాచేసి అమ్ముకోవడంతో అక్రమ నిర్మాణాలు వెలిశాయి.
2009లో ఇదే ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇండ్ల నిర్మాణం చేపట్టారని అప్పటి సబ్ కలెక్టర్లు దాదాపు 56 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ ప్రభుత్వ భూమిలో ప్లాట్లు చేసి ఒక్కో ప్లాటును రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే కబ్జాదారులకు రెవెన్యూ అధికారుల అండ ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే దాదాపు 30 మంది వరకు తహసీల్దార్ కార్యాలయం నుంచి 20 రోజుల క్రితమే నోటీసులు సైతం వెళ్లాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని, పనులు నిలిపి వేయాలని ఆదేశించారు. అయినప్పటికీ రాత్రికి రాత్రి ఇండ్ల నిర్మాణాలను కొనసాగిస్తుండటం గమనార్హం.
ప్రభుత్వ స్థలం కబ్జా వెనుక రెవెన్యూ యంత్రాంగం హస్తం ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల అండతోనే నిర్మాణాలు చేపడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సంబంధిత ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారితోపాటు అక్రమంగా ఇండ్ల నిర్మాణం చేపడుతున్న వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్టు ఆరోపిస్తున్నారు. ఒక్కో ఆక్రమణదారుడి నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లిలోని ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్న విషయం వాస్తవమే. అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశిం చాం. అయినప్పటికీ నిర్మాణాలు చేపట్టిన దా దాపు 30 మందికి నోటీసులు పంపించాం. గడువులోగా నోటీసులకు స్పందించకపోతే కలెక్టర్కు నివేదిస్తాం. అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– లక్ష్మీనారాయణ, తహసీల్దార్, వికారాబాద్