హైదరాబాద్: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో (Model Schools) పనిచేస్తున్న దాదాపు మూడు వేల మంది టీచర్ల చిరకాల వాంఛ ఎకేలకు నెరవేరింది. 11 ఏండ్లుగా ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురుచూస్తున్న టీచర్ల కోరక ఫలించనుంది. మోడల్ స్కూల్స్లో ప్రిన్సిపళ్లు, పీజీటీ, టీజీటీల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 89 మంది ఆదర్శ ప్రిన్సిపల్స్, 1923 మంది పీజీటీలు, 745 మంది టీజీటీలు మొత్తం 2757 మందికి త్వరలో స్థానచలనం కలుగనుంది. ఈ మేరకు మోడల్స్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు.
మోడల్ స్కూళ్లలోని ఉపాధ్యాయులు 2013, 2014లో రెండు విడుతల్లో నియమితులయ్యారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా బదిలీలు జరుగలేదు. దీంతో గత మూడేండ్లుగా ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది జులైలో బదిలీలకు షెడ్యూల్ జారీచేసింది. వారంతా వెబ్ ఆప్షన్లు కూడా నమోదుచేసుకున్నారు. అయితే సర్వీస్ పాయింట్ల కేటాయింపుపై కొందరు హైకోర్టు మెట్లెక్కారు. దీంతో కోర్టు స్టే ఇవ్వడంతో బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా మెరిట్ ప్రకారం సీనియారిటీ జాబితా తయారు చేసి బదిలీలు చేపట్టవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. ఉద్యోగాల్లో చేరిన తేదీని ఆధారంగా చేసుకుని ఎన్టైటిల్మెంట్ పాయింట్లు కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టీచర్లను ట్రాన్స్ఫర్కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.