మూసీ నదికి పునరుజ్జీవనం తేవడం… తద్వారా దిగువన నల్లగొండ జిల్లా రైతులను మురికి మూసీ నుంచి విముక్తి కల్పించడం… కాంగ్రెస్ సర్కారు చెప్తున్న ఈ మాటలన్నీ ఒట్టి బూటకమని తేలింది.
ఉమ్మడి రాష్ట్రంలో జీవనదిని మురికికూపంలా మారిస్తే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏకంగా ‘రియల్’కూపంగా మార్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. తొలుత థేమ్స్ తరహా అభివృద్ధి అంటూ మూసీ సుందరీకరణ రాగాన్ని అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం చివరకు దక్షిణ కొరియాలోని చుంగ్ చై చున్ అనే పిల్ల కాల్వ పక్కన ఉన్న ఆకాశహర్మ్యాలను చూపించింది. ఇందుకు మరింత బలాన్ని చేకూర్చేలా ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికలో భారీ ఎత్తున రియల్ పెట్టుబడులను ఆకర్షిస్తామని పేర్కొనడంతో రేవంత్ సర్కారు చెప్తున్న పునరుజ్జీవన కథలన్నీ కట్టుకథలేనని తేలిపోయింది.
జీవనదికి పూర్వ వైభవాన్ని తీసుకురావడం వరకు సరే… కానీ ఆ సాకుతో పేద, మధ్యతరగతిని పరీవాహకం నుంచి వెళ్లగొట్టేది అక్కడ రియల్ ఎస్టేట్ దందా కోసమా? ఇప్పుడిదే మిలియన్ డాలర్ల.. కాదు కాదు.. లక్షా యాభైవేల కోట్ల ప్రశ్న!
Musi River | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబరు 25 (నమస్తే తెలంగాణ): గత ఏడాది కాలంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న హైడ్రామా ఎట్టకేలకు రియల్ డ్రామానేనని స్పష్టమైంది. కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు కాకుండానే నిరుపేదల ఇండ్లను కూల్చివేసేంది. దాదాపు 16వేల ఇండ్ల వరకు రెడ్ మార్కింగ్ చేసిన అధికారులు… అందులో 170 ఇండ్లకు పైగా కూల్చివేశారు. దీంతో పాటు మిగతా నివాసాల కూల్చివేతకు కూడా భారీఎత్తున రంగం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తున రావడంతో పురోగతిలో స్తబ్దత నెలకొంది. దీనికి అదనంగా ఏకంగా రూ.1.50 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో మూసీ నది పరీవాహకంలో ఏం జరుగబోతున్నది? అంటూ తెలంగాణ సమాజం ఒక్కసారిగా అవాక్కైంది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా నెలల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం లక్ష కోట్లు ఎగబాకడంపై భారీఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించి… అసలు సుందరీకరణ కానే కాదు! మూసీ నది పునరుజ్జీవనం అంటూ సెలవిచ్చారు.
మురికికూపంలో ఉన్న నదిని కాపాడుదామనుకుంటే ఇదెక్కడి గాయి అంటూ ఎదురుదాడి చేశారు. నదిలో స్వచ్ఛమైన గోదావరి జలాలు పారించేందుకే ఎఫ్టీఎల్, బఫర్జోన్లలోని నిర్మాణాలను తొలగించనున్నట్టు చెప్పారు. దిగువన ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పాదయాత్ర కూడా చేపట్టారు. మరోవైపు మంత్రులు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు కూడా మూసీ నదిని బాగు చేస్తామే తప్ప ఇందులో రియల్ ఎస్టేట్ యావ లేదని ప్రకటనలు చేశారు. ‘మన హైదరాబాద్‌లో కూడా సియోల్ నగరానికి ఉన్న విధంగానే ఒక నది నగరం మధ్యలో నుంచి ప్రవహిస్తుంది. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడికి టూర్‌కు వచ్చినపుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు మమ్మల్ని పంపించాడు. చుంగ్ చై చున్ పక్కనే రెస్టారెంట్లు, ఇవన్నీ (ఆకాశహర్మ్యాలు) వచ్చినయి.
ఇవన్నీ పీపీపీ (పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్) విధానంలో వచ్చిన ప్రాజెక్టులు. హైదరాబాద్‌లోని మూసీని కూడా ఇట్ల తయారు చేస్తే ప్రపంచంలోనే గుర్తింపు వస్తుంది…’ అని కొన్నిరోజుల కిందట సియోల్ పర్యటనకు వెళ్లిన మంత్రుల బృందం స్పష్టంగా చెప్పింది. దీంతో అప్పుడే మూసీ పరివాహక భవిష్యత్తుపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనికి తోడు ప్రజా సంఘాలకు కొన్నిరోజుల కిందట మంత్రి శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజంటేషన్‌లోనే మూసీకి రెండువైపులా కిలోమీటరు చొప్పున గ్రోత్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని, ఆ మేరకు భూసేకరణ చేపడతామని కూడా స్పష్టం చేశారు. దీంతో సియోల్ పర్యటనలో మంత్రులు చెప్పిన ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులే రాష్ట్ర ప్రభుత్వ అసలు లక్ష్యంగా బహిర్గతమైంది.
ప్రాథమిక నివేదికలో గుట్టురట్టు…
మూసీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. తద్వారా మూసీ పరివాహకం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అంటున్నది. కానీ కొన్నిరోజుల కిందట ఎమ్మెల్సీ కవిత బయటపెట్టిన ప్రపంచ బ్యాంకు ప్రాథమిక ప్రాజెక్టు నివేదికలో మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు అసలు ఉద్దేశమేందో రట్టయింది. నిర్మాణాలను తొలగించాలని చెబుతున్న ప్రభుత్వం మూసీ ప్రాజెక్టులో భాగంగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ను నివేదికలో అనేకసార్లు ఉటంకించడమే ఇందుకు నిదర్శనం. ఈ నివేదికలో అనేక చోట్ల మూసీ పరివాహకంలో పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో కార్పొరేట్ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించి రియల్ ఎస్టేట్ డెవపల్‌మెంట్ చేస్తామని స్వయంగా అంగీకరించింది. పర్యాటకం, వినోదం, రియల్ రంగాలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఆదాయ వనరుగా కూడా పేర్కొన్నది. ఈ నేపథ్యంలో నిరుపేదల ఇండ్లను కూల్చివేయడమంటే మూసీని ప్రక్షాళన చేయడం కాదనేది, మూసీ సుందరీకరణ కోసమే అనేది అర్థమవుతుంది. అంటే నిరుపేదల ఇండ్లను కూల్చివేసిన చోట ఆకాశహర్మ్యాలు నిర్మించేందుకు కూడా కార్పొరేట్ పెట్టుబడులను ఆకర్షిస్తారని స్పష్టమవుతుంది. అయితే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.లక్షన్నర కోట్లు అని సీఎం రేవంత్ స్వయంగా చెప్పిన దరిమిలా మూసీకి రెండు వైపులా రియల్ ఎస్టేట్ అభివృద్ధి కేవలం ఎఫ్టీఎల్, బఫర్కు మాత్రమే పరిమితం కాకుండా రెండువైపులా కిలోమీటరు చొప్పున ఉంటుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
పేదల ఇండ్ల కూల్చివేతకు పచ్చజెండా ఊపుతుందా?
మూసీ ప్రాజెక్టులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవంత్ సర్కారు ప్రపంచ బ్యాంకు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4100 కోట్ల రుణాన్ని తీసుకోవాలని భావిస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.1763 కోట్లు కలిపి రానున్న ఏడేండ్లలో ఖర్చు చేస్తామని ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక (పీపీఆర్)లో పేర్కొన్నది. దీంతో కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం మెయిన్‌హార్ట్ కన్సార్టియం ద్వారా ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్, డీపీఆర్ రూపకల్పనకు కసరత్తు చేస్తున్నది. డీపీఆర్ పూర్తయిన తర్వాత దానిని కేంద్రానికి పంపాల్సి ఉంది. ప్రపంచ బ్యాంకు రుణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల కూల్చివేతలు, పునరావాసం వంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం పేదల ఇండ్ల కూల్చివేతకు తాము వ్యతిరేకం అని ఇక్కడ ప్రకటిస్తున్నారు. అంతేకాదు.. ఒకడుగు ముందుకేసి కేంద్ర మంత్రులు సహా బీజేపీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు మూసీ నిద్ర కూడా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభు త్వం పంపిన డీపీఆర్‌కు సమగ్రంగా పరిశీలించి మా ర్పులను సూచిస్తుందా? యదాతథంగా ఆమోదం తె లుపుతుందా? ఒకవేళ కూల్చివేతలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే తెలంగాణ బీజేపీ బాధితులకు ఏం సమాధానం చెబుతుంది? ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.