Congress Govt | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం పలు అంశాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నది. సమయం మించిపోతున్నా పట్టించుకోవడం లేదు. కొన్ని విషయాల్లో పీకల మీదికి వచ్చాక హడావుడి నిర్ణయాలు తీసుకుంటున్నది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు ఇటీవలి స్థానికత అంశమే ప్రత్యక్ష ఉదాహరణ. ఇదే కాదని, ఇలాంటివి ఎన్నో ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
జనవరి నుంచే చెప్తున్నా..
ఉమ్మడి కోటా పూర్తవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల్లో ప్రవేశాల స్థానికతపై నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జనవరి నుంచే ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వినతులు అందాయి. అయినా పట్టించుకోలేదు. చివరికి జూలైలో హడావుడిగా నిర్ణయం తీసుకున్నది. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల నోటిఫికేషన్‌తోపాటు జీవో 33ని విడుల చేసింది. దీంతో వివాదం చెలరేగింది. ప్రభుత్వం ముందునుంచే దృష్టిపెడితే ఈ సమస్య వచ్చేది కాదని నిపుణులు పేర్కొంటున్నారు.
కేసీఆర్ కిట్ ఉన్నట్టా? లేనట్టా?
మాతాశిశు సంరక్షణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టి రూ.15వేల ఆర్థికసాయం అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకం పేరును తీసేసింది. ప్రస్తుతం తాత్కాలికంగా ఎంసీహెచ్ కిట్‌గా పిలుస్తున్నారు. గతంలో సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేయగా, ఇప్పుడు ‘ప్రధానమంత్రి మాతృవందన యోజన’ను కలిపి అమలుచేయాలని, కొత్త పేరు పెట్టాలని భావిస్తున్నది. ఈ విషయమై ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు.
ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఏవీ?
ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద వందలాది మంది విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నారు. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వారు ఫీజులు కట్టలేక సతమతమవుతున్నారు. కొందరు అప్పు చేసి ఫీజులు కట్టుకుంటున్నారు. మరికొందరు చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితి నెలకొన్నది.
ఆలస్యంగా చేపపిల్లల టెండర్లు
ఉచిత చేపపిల్లల పంపిణీ పథకానికి సాధారణంగా ఏప్రిల్‌లో టెండర్లు పిలిచి ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం జూలైలో ఈ ప్రక్రియ ప్రారంభించింది. వానలు మొదలయ్యాక టెండర్లు పిలిచింది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ టెండర్లు పూర్తికాలేదు.
పెంచిన మెస్‌చార్జీలు అమలెప్పుడు?
సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలను 25శాతం మేరకు పెంచాలని చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దే పెండింగ్ ఉన్నాయి. పెరిగిన ధరలతో కాంట్రాక్టర్లు నాసిరకం సరుకులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తరుచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
డీఎస్సీ-2008 బాధితులకు ఉద్యోగాలేవీ?
డీఎస్సీ-2008 బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ ఈ ఏడాది ఫిబ్రవరి 24న నిర్ణయించింది. ఏపీ తరహాలో ఎంటీఎస్ పద్ధతిలో నియామకాలు చేపడుతామని చెప్పింది. విధివిధానాల ఖరారు బాధ్యత జీవో 317 క్యాబినెట్ సబ్ కమిటీకి అప్పగించింది. ఆరు నెలలు గడుస్తున్నా సబ్ కమిటీ నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 27లోగా పూర్తి చేస్తామని న్యాయస్థానానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది.
గురుకుల అభ్యర్థులపై నిర్ణయం ఎప్పుడు?
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో 8,708 పోస్టులకు ట్రిబ్ నియామక ప్రక్రియ చేపట్టింది. 1:2 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ట్రిబ్ డిసెండింగ్ ఆర్డర్‌ను పాటించకపోవడం, ఇష్టారాజ్యంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టడంతో భారీగా బ్యాక్‌లాగ్‌లు ఏర్పడుతున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డౌన్మెరిట్ అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.