కరీంనగర్, అక్టోబర్ 28 (కే ప్రకాశ్‌రావు, నమస్తే తెలంగాణ ప్రతినిధి): దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న ఆలయం భక్తులకు కొంగుబంగారం. తెలంగాణలోనే అతి పెద్ద శైవక్షేత్రం. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశారు. ఆలయాన్ని నవనాట సిద్ధులు స్థాపించడం వల్ల ఇక్కడికి వచ్చే భక్తులు ఏమి కోరుకున్నా సిద్ధిస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. చతుష్కాల పూజలు, నిత్య కైంకర్యాలతోపాటు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వేములవాడలో కోడె మొక్కుల సంప్రదాయం ఉన్నది. కష్టనష్టాల్లోంచి బయటపడితే.. కోర్కెలు తీరితే భక్తులు రాజరాజేశ్వరుడికి కోడెలను సమర్పించుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎములాడ రాజన్న తెలంగాణ ఇంటింటి దేవుడు. దేశంలోని మరే శైవక్షేత్రాల్లోనూ లేని ఆచార సంప్రదాయాలు ఇక్కడ ఉండటం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తున్నది.
తెలంగాణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రాజన్నను దర్శించుకుంటారు. ఇంతటి విశిష్టత ఉన్న ఆలయ అభివృద్ధిలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. పక్కా ప్రణాళిక లేకపోవడం, సమన్వయ లోపం కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దర్శనాల విషయంలో స్పష్టత లేకపోవడం, కోడెమొక్కులను భీమేశ్వర అలయానికి మార్చడంసహా రోజుకో నిర్ణయం, పూటకో మాట అన్నట్టుగా సాగిపోతున్నది. దీంతో పనుల తీరుపై భక్తుల్లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
క్రీ.శ.1083లో ఆలయ నిర్మాణం
వేములవాడ ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు.. ఒక చారిత్రక పట్టణం. క్రీ.శ 8వ శతాబ్దం నాటి ‘సపాదలక్ష’ దేశానికి (నేటి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు కలిసిన ప్రాంతానికి) మలి రాజధాని. మొదట బోధన్ రాజధానిగా సపాదలక్షను ఏలిన వేములవాడ చాళుక్యులు (రాష్ట్రకూటుల సామంతులు) ఆ తర్వాత వేములవాడ రాజధానిగా క్రీ.శ 750 నుంచి క్రీ.శ.973 వరకు 225 ఏండ్లు నిరాటంకంగా పరిపాలించారు. మొత్తం 12 మంది రాజుల ఏలుబడిలో వేములవాడ ఆధ్యాత్మిక క్షేత్రంగా కవులు, కళాకారులకు పుట్టినిల్లుగా భాసిల్లింది.
ఇక్కడ దొరికిన సుమారు పదిశాసనాలు వేములవాడ పూర్వ చరిత్రను వర్ణిస్తున్నాయి. మొదట లేంబుళవాటికగా ఉండగా, తర్వాత ‘లేంబులవాడె’గా కాలక్రమంలో ‘ఏములవాడ’గా అనంతరం ‘వేములవాడ’గా రూపాంతరం చెందింది. రాజరాజేశ్వర ఆలయాన్ని కళ్యాణి చాళుక్య సామంతుడైన రాజాదిత్యుడు తన పేరుతో క్రీ.శ.1083లో ‘రాజదిత్యేశ్వరాలయం’ నిర్మించారు. ఆయన వేయించిన శాసనం నేటికీ దేవాలయ ప్రాంగణం వాయువ్య మూలలో ఉన్నది. క్రమంగా ఆలయం పేరు రాజరాజేశ్వర ఆలయంగా మారింది. అంటే ఆలయ నిర్మాణం జరిగి 942 ఏండ్లు అయ్యిందన్నమాట.
నాలుగు దశల్లో పనులు అంటూ..
కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. మొత్తం నాలుగు దశల్లో నిర్మాణ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకోసం రూ.696.25 కోట్లు అవుతుందని అంచనా వేసింది. ఫేజ్-1 కింద రూ.76 కోట్లతో దేవాలయ విస్తరణ, రూ.35.25 కోట్లతో అన్నదానం బ్లాక్ నిర్మాణాలను 2024-25లోపు పూర్తిచేయాలని నిర్ణయించింది. ఫేజ్-2 కింద రూ.285 కోట్లతో ఆలయ సముదాయం, అన్నదానం అదనపు పనులు, పవిత్ర మండలంలో అదనపు పనులను 2025-26లో పూర్తి చేస్తామని ప్రకటించింది. ఫేజ్-3 కింద రూ.100 కోట్లతో గుడిచెరువు కట్ట, ఘాట్ వివిధ విభాగాల అభివృద్ధిని 2026-27లోగా పూర్తిచేయాలని భావించింది. ఫేజ్-4 కింద రూ. 200 కోట్లతో యాత్రికులకు 20 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం, చుట్టు పక్కల దేవాలయాలు, జంక్షన్ల అభివృద్ధిని 2027-28లో పూర్తి చేయాలని నిర్ణయించింది. కానీ ఆలయ అభివృద్ధి డీపీఆర్‌ను ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదని, నిధులు ఎక్కడినుంచి వెచ్చిస్తారో స్పష్టత లేదని ఆలయ పరిరక్షణ కమిటీ పేర్కొంటున్నది.
ప్రతిపాదనలు లేకుండానే సీఎం శంకుస్థాపన
ప్రకటనలు భారీగానే ఉన్నా.. అమలులో మాత్రం అడుగడుగునా ప్రణాళిక లోపం కనిపిస్తున్నది. దేవస్థానం అభివృద్ధి పనులకు గతేడాది నవంబర్ 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రాథమిక పనుల కోసం సంబంధిత కన్సల్టెన్సీకి రూ.10 లక్షల సర్దుబాటు ప్రాతిపదికన వీటీడీఏ (వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) ద్వారా ఈ ఏడాది మార్చి 10న చెల్లించారు. ఇప్పటికీ ఆ నిధులు తిరిగి వీటీడీఏకు అప్పగించలేదు. మార్చి 20న జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. గుడి విస్తరణ పనుల్లో ఈ నివేదికే అత్యంత కీలకం. కానీ ఇప్పటివరకు వివరాలు బయటపెట్టలేదు. టెంపుల్ కాంప్లెక్స్‌కు సంబంధించిన అంచనాలను మార్చి 27న ఆర్‌ఆండ్‌బీ అధికారులు సమర్పించారు. ఈ టెండర్లను జూలై 22న అప్లోడ్ చేశారు. అంటే, ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన నాలుగు నెలల తర్వాత అంచనాలను రూపొందించారన్నమాట. ప్రతిపాదనలు సిద్ధం కాకుండానే సీఎం శంకుస్థాపన చేయడం, రూ.76 కోట్ల పనులకు సంబంధించి అంచనాలు, టెండర్ల ప్రక్రియకే ఐదారు నెలలు పట్టడాన్ని బట్టి ప్రణాళికా లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని నిపుణులు విమర్శిస్తున్నారు.
అడుగడుగునా అస్పష్టత
ఆలయ విస్తరణ పేరుతో అధికారులు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలు భక్తులకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. రాజన్న ఆలయంలో నిత్యం నిర్వహించే కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, కుంకుమ పూజ, నిత్య కల్యాణం, చండీహోమం తదితర పూజ కార్యక్రమాలను ఈ నెల 11 నుంచి భీమేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించడానికి ఏర్పా ట్లు చేసినట్టు అదేరోజు ఆలయ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అదేరోజు భీమేశ్వరస్వామి ఆలయంలో స్వ యంగా కోడె మొక్కలు చెల్లించారు. తద్వారా పూజలను అధికారికంగా ప్రారంభించినట్టు చెప్పుకొచ్చారు. 12 నుంచి శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
వీటిపై విమర్శలు రావడంతో ప్రధాన ఆలయంలో నిత్య కైంకర్యాలు, చతుష్కాల పూజలు, ఆలయ అర్చకులచే యథావిధిగా అంతరంగికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపైనా నిరసనలు వెల్లువెత్తడంతో తిరిగి దర్శనాలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ వస్తున్నారు. తాజాగా కోడె మొక్కులను మళ్లీ భీమన్న ఆలయానికి మార్చారు. భీమన్న ఆలయంలో దర్శనాలు ఏమిటని పలువురు ప్రశ్నించగా రాజన్న ఆలయం తూర్పు ద్వారం వద్ద ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా స్వామివారి సన్నిధిలో జరిగే చతుష్కాల పూజలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి చర్యలు తీసుకుంటామని ముం దుగా ప్రకటించారు. ఆగమశాస్త్రం ప్రకారం మూల విరాట్‌ను ఎలా ప్రత్యక్ష ప్రసారం చేస్తారని పూజారుల అభ్యంతరంతో వెనక్కి తగ్గా రు. పూజా కార్యక్రమాలను మాత్రమే ప్రసా రం చేస్తామంటూ మాట మార్చారు.
కాంక్రీట్, ఇటుకలతో ఆలయమా?
తొమ్మిదిన్నర శతాబ్దాల చరిత్రకు అద్దం పట్టే వేములవాడ ఆలయం కాంక్రీట్మయం కాబోతున్నదని భక్తులు వాపోతున్నారు. మాస్టర్‌ప్లాన్ ప్రకారం 70 కాంక్రీట్ పిల్లర్లతో మండప నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. వీటికి రాతిపలకలు తొడుగుతామని ఇంజినీర్లు చెప్తున్నారు. దీంతో ప్రాచీన వైభవం కనుమరుగవుతుందని భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 1970వ దశకంలో రాతిమండప నిర్మాణమే చేపట్టారని గుర్తు చేస్తున్నారు.
ఇది సరైన సమయమేనా..?
ఆలయ విస్తరణ పేరిట చేపడుతున్న పనులకు ఇది సరైనా సమయమేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు తెలంగాణ కుంభమేళాగా భావించే సమ్మక-సారలమ్మ జాతర ఉన్నది. సమ్మక జాతరకు వెళ్లే భక్తులు ఒకటి రెండు నెలల ముందు నుంచే రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. జనవరిలో దాదాపు కోటి మంది భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుంది. దేవాలయానికి సైతం పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. రోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తారని తెలిసినా, ఈ సమయంలో ఆలయ నిర్మాణ పనులు చేపట్టడం, దర్శనాల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిధులు ఏవి?
ఇక మొదటి దశ పనులకు నిధులు మంజూరైనట్టు అధికారులు చెప్తున్నా, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఖాతాకుగానీ, వీటీడీఏ ఖాతాకు గానీ నిధులు జమకాలేదని సమాచారం. రాజన్న ఆలయంలో జరగాల్సిన దర్శనాలు, కోడె మొక్కులను భీమేశ్వరాలయానికి మార్చేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ పనులకు ఆలయ ఖజానా నుంచే సుమారు రూ.4కోట్లు వాడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతోపాటు ఆలయ అభివృద్ధి పేరిట దాదాపు రూ.3 కోట్ల వరకు దేవాలయ నిధులు వాడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడితో ఆగకుండా మొదటి దశలో పనుల కోసం రూ.70కోట్లను స్వామి ఖజానా నుంచే ఖర్చు చేసేలా, స్వామివారికి భక్తులు సమర్పించిన వెండి, బంగారం కూడా పునర్నిర్మాణానికి వినియోగించేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని దేవాదాయశాఖలో చర్చ జరుగుతున్నది.
ఇంత నిర్లక్ష్యమా?
ఆలయ పనులపై ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమాత్రం దృష్టిపెట్టడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలయ పను లు ప్రారంభించడానికి గతేడాది నవంబర్‌లో వచ్చి వెళ్లారు. మంత్రులు కూడా అప్పుడే వచ్చి వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి సీఎం గానీ, కనీసం దేవాదాయశాఖ మంత్రి గానీ, ఉమ్మడి జిల్లా మంత్రులు గానీ ఆలయ పునర్నిర్మాణ పనులపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. నిర్మాణం మొత్తం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పినట్టే జరుగుతున్నదని ఆరోపణలు ఉన్నాయి. ఆయన అధికారులతో సమన్వయం చేసుకోకపోవడంతో ప్రణాళిక లేకుండా సాగుతున్నాయని విమర్శిస్తున్నారు. వీటీడీఏ అథారిటీలో ఈవో, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలను సభ్యులుగా చేర్చా రు. స్థపతి, ఎస్టేట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఇంజినీర్లను భాగస్వాములను చేశారు. వైస్‌చైర్మన్ కం సీఈవో ఇన్చార్జిగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆ అథారిటీ నిర్వీర్యమైంది. ఎమ్మెల్యే తప్ప మిగతా సభ్యులందరూ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వీటీడీఏ అధికారులు సైతం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఈ ప్రశ్నలకు సమాధానలెక్కడ?
కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి ప్రణాళికలు
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వివిధ ప్రాంతాలనుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రూ.30 కోట్లు వెచ్చించి 35 ఎకరాల స్థలాన్ని సేకరించారు. రూ.116 కోట్లతో చెరువు సుందరీకరణ, బండ్ ఆధునీకరణ పనుల్లో దాదాపు 75 శాతం పూర్తి చేశారు.
ఎంత మంది భక్తులు వచ్చినా రాజన్న ఆలయ పరిధిలో నీటి కొరత లేకుండా ఉండేందుకు మధ్యమానేరు ప్రాజెక్టునుంచి రూ.22 కోట్లతో ప్రత్యేకంగా ఎత్తిపోతల ద్వారా గుడిచెరువుకు నీళ్లు తెచ్చి నింపుతున్నారు. రూ.5 కోట్లతో ప్రత్యేకంగా మిషన్ భగీరథ కింద పనులు జరిగాయి. రూ.15 నుంచి 20 కోట్లు వెచ్చించి వేములవాడకు నలుదిశలా ఉండే అప్రోచ్రోడ్డులను బాగుచేశారు. పట్టణంలోని ఇరుకు రోడ్లను గుర్తించి, బైపాస్‌రోడ్డు నిర్మించారు. ఇదే సమయంలో యాదాద్రి నిర్మాణం తుదిదశకు చేరడంతో వేములవాడ ఆలయ విస్తరణ పనులు మొదలు పెట్టలేదు. యాదాద్రి పనులు పూర్తయిన తర్వాత రాజన్న అలయ విస్తరణపై దృష్టి పెట్టే సమయానికి అసెంబ్లీ ఎన్నికలు వచ్చి, ప్రభుత్వం మారిపోయింది.