Breaking News | ఆర్టీసీ జేఏసీ సమ్మె హెచ్చరికలపై ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ జేఏసీతో చర్చలకు ఆహ్వానించింది. సాయంత్రం ఐదు గంటలకు సెక్రటేరియట్లో ఆర్టీసీ యాజమాన్యం, జేఏసీ నేతలతో ప్రభుత్వ పెద్దలు సమావేశం కానున్నారని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు.
కాగా, అంతకుముందు సమ్మెపై ఈదరు వెంకన్న మాట్లాడుతూ.. తమ సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి సమ్మె చేపడుతున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని పేర్కొన్నారు. సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులు అవుతున్నా.. ఇప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం తమను చర్చలకు పిలవలేదని తెలిపారు. కనీసం సమ్మె నివారణ చర్యలు కూడా చేపట్టలేదని పేర్కొన్నారు.
ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మె.. మరో సకల జనుల సమ్మెగా మారబోతుందని హెచ్చరించారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు.