గుండాల, జూన్ 17: నిండు గర్భిణిని ప్రభుత్వ దవాఖానలో చేర్చుకోకపోవడంతో 108 వాహనంలోనే గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా గుండాల మండలంలో ఆది వారం రాత్రి చోటుచేసుకుంది. పడుగోనిగూడెం పంచాయతీ నాగారాకి చెందిన కల్తి నవ్య నిండు గర్భిణి. శనివారం రాత్రి పురిటి నొప్పు లు రావడంతో భర్త సురేశ్ ఆదివారం ఉదయమే 108కు ఫోన్ చేయగా.. సిబ్బంది గుండాల పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ నవ్యను పరీక్షించిన పీహెచ్సీ వైద్యులు.. ఆ మెకు ఇంకా నెలలు నిండలేదని, జిల్లా కేంద్రమైన కొత్తగూడెం దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. అదే వాహనంలో కొత్తగూడెం చేరుకున్నారు. అక్కడి వైద్యులు సరిగా పరీక్షించకుండానే గర్భిణికి అంతా బాగుందని చె ప్పారు. చేసేదేమీలేక అదే రోజు సాయంత్రం ఆర్టీసీ బస్సులో వంద కిలోమీటర్లు ప్రయాణించి మారుమూల ఏజెన్సీలో ఉన్న స్వగ్రామానికి చేరుకున్నారు. రాత్రి అయ్యాక పురిటి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. భర్త సురేశ్ మరోసారి 108 వాహనానికి ఫోన్ చేశాడు. మళ్లీ వచ్చిన 108 సిబ్బంది.. గర్భిణిని గుండాల పీహెచ్సీకి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలోనే పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. 108 వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి.. ఈఎంటీ కృష్ణవేణి గర్భిణికి కాన్పు చేసి పండంటి పాపకు పురుడుపోశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.