Green Field Road | రంగారెడ్డి, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో రైతులపై మరోమారు గ్రీన్‌ఫీల్డ్ పిడుగు పడనున్నది. మీర్ఖాన్పేట సమీపంలో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం రెండో విడత భూసేకరణకు ప్రభు త్వం నోటిఫికేషన్ జారీచేసింది. మీర్ఖాన్పేట నుం చి కుర్మిద్ద, కడ్తాల్, ముద్విన్, ఆమనగల్లు మీదుగా ఆకుతోటపల్లి వరకు సుమారు 21 కిలోమీటర్ల మేర 330 అడుగుల వెడల్పు రహదారి నిర్మాణానికి 554 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మూడురోజుల క్రితం నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో మరో రెండుమూడు రోజుల్లో గుర్తించిన భూముల నుంచి సర్వే చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడతలో కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర 300 అడుగుల రోడ్డు వేయడానికి 449 ఎకరాలను గుర్తించి సర్వే పూర్తిచేశారు. త్వరలోనే ఆ భూములకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఆయా భూములు ప్రస్తుత మార్కెట్లో కోట్ల రూపాయల విలువ చేస్తుండగా, ప్రభుత్వం మార్కెట్ విలువ ప్రకారమే పరిహారం ఇస్తామని చెప్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తొలి విడతలో ఫిరోజ్‌గూడ, కొంగరకలాన్, కొంగరకుర్దు, లేమూర్, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట మీదుగా రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. రెండో విడతలో కూడా రోడ్డు కోసం భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం మొత్తం 4,725 మంది రైతుల నుంచి 554 ఎకరాల భూసేకరణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రాంతాల్లో భూక్రయ, విక్రయాలు, అభివృద్ధి పనులను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అభ్యంతరాలుంటే రెండు నెలల్లో లిఖితపూర్వకంగా కలెక్టర్‌కు తెలియజేయాలని సూచించింది.
తొలి విడత సర్వేలో అడుగడుగునా అడ్డంకులు
ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం తొలి విడత చేపట్టిన భూసేకరణకు రైతుల నుంచి అడుగడుగునా అవరోధాలు ఏర్పడ్డాయి. సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి రైతులను నిర్బంధించి సర్వే చేపట్టింది. మద్దతుగా తరలివచ్చిన రాజకీయ నాయకులను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. పోలీసుల నిర్భందం మధ్య అధికారులు తొలి విడత సర్వేను పూర్తిచేశారు. రెండో విడత సర్వేను కూడా అడ్డుకోవాలని రైతులు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు. భూమికి భూమి ఇచ్చిన తర్వాతే తమ భూములను తీసుకోవాలని, లేని పక్షంలో సర్వేను ముందుకు సాగనివ్వబోమని రైతులు తేల్చిచెప్తున్నారు. పచ్చని పంటపొలాల నుంచి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేయడం ఏమిటని, తమ కొద్దిపాటి భూమిని రోడ్డు కోసం తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రెండువేల కోట్లు మంజూరు!
కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి ఆకుతోటపల్లి వరకు నిర్మించనున్న 41 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం ప్రభుత్వం తొలి విడతలో రూ.2,000 కోట్లు మంజూరు చేయడానికి పచ్చజెండా ఊపినట్టు తెలిసింది. రెండు విడతల రోడ్డు కోసం భూసేకరణ పూర్తయిన వెంటనే రైతులకు పరిహారం అందించి రోడ్డు పనులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందులో భాగంగా రెండు విడతల్లో 1,003 ఎకరాలకు పరిహారంతోపాటు రోడ్డు పనులు చేపట్టడం కోసం ఈ నిధులు వెచ్చించే యోచనలో ఉన్నట్టు సమాచారం.