Indiramma Indlu | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇంతవరకు జారీ చేయలేదు. ఒక్కో నియోజకవర్గంలో 3,500 చొప్పున ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వానికి గ్రేటర్ హైదరాబాద్లోని 25 నియోజకవర్గాలతోపాటు గ్రేటర్ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ తదితర జిల్లాల్లోని 40 అర్బన్ నియోజకవర్గాల్లో పేదల నుంచి దాదాపు 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మార్గదర్శకాలు లేకపోవడంతో వాటిని పెండింగ్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి దశలో జాగా ఉన్నవారికే ఇల్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పట్టణ ప్రాంతాల్లోని పేదలు ఇంటిని పొందే అర్హత కోల్పోతున్నారు.
మురికివాడల్లో నివసిస్తున్న పేదల్లో ఎక్కువ శాతం మందికి సొంత జాగాలు లేవు. వారంతా అనాదిగా ప్రభుత్వ భూముల్లోనే గుడిసెలు, కచ్చా ఇండ్లు నిర్మించుకొని కాలం వెళ్లదీస్తున్నారు. చాలా కాలం నుంచి వారు అక్కడే ఉంటుండడంతో కరెంట్, నల్లా కనెక్షన్లు మంజూరయ్యాయి. కానీ, ఇండ్ల పట్టాలు గానీ, ఆయా జాగాలపై యాజమాన్య హక్కులు సూచించే ధ్రువపత్రాలు గానీ లేవు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 10 లక్షల మందిలో 90% మందికి సొంత జాగాలు లేవు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర పట్టణాల్లో సైతం ఇంచుమించు ఇదే పరిస్థితి ఉన్నది. దీంతో వారంతా ఇందిరమ్మ ఇల్లు పొందే అర్హత కోల్పోయినట్టే.
పట్టణాల్లో రెండు విధాలుగా ఇండ్ల నిర్మాణం
ప్రభుత్వ జాగాల్లో అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వ డం ఒక విధానమైతే, ప్రస్తుతం నివసిస్తున్న ప్రదేశం నుంచి పేదలను ఖాళీ చేయించి అదేచోట అపార్ట్మెంటు నిర్మించి అందరికీ కేటాయించడం మరో విధానం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జియాగూడ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈ విధంగానే అపార్ట్మెంట్లు నిర్మించి లబ్ధిదారులకు అందించింది. ఇతర మురికివాడల్లో నివసిస్తున్నవారికి ప్రభు త్వ జాగాలు ఉన్నచోట డబుల్ బెడ్రూ మ్ ఇండ్లను నిర్మించి ఇచ్చింది. ఇలా గ్రేటర్ హైదరాబాద్లోని లక్ష పేద కుటుంబాలకు ఇండ్లను సమకూర్చింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జాగాలు లేవనే కారణంతో పట్టణ పేదలకు ఇండ్లను మంజూరు చేయకుండా, కాలయాపన చేయడం విమర్శలకు తావిస్తున్నది.